అహంభావాన్ని తొలగించిన హనుమంతుడు
త్రేతాయుగంలో శ్రీమన్నారాయణుడు రామావతారాన్ని ధరించాడు. లోక కల్యాణం కోసం రావణ సంహారం చేశాడు. ఈ నేపథ్యంలో హనుమంతుడు కీలకమైన పాత్రను పోషించాడు. చిరంజీవిగా ఆశీస్సులు అందుకున్న హనుమంతుడు హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ ఉండసాగాడు.
ద్వాపరయుగంలో భీముడు హిమాలయ పర్వత ప్రాంతానికి చేరుకుంటాడు. ద్రౌపతి మనసుపడిన సౌగంధికా పుష్పం గురించి ఆయన అక్కడ అన్వేషిస్తుంటాడు. భీముడు అటుగా రావడాన్ని హనుమంతుడు గమనిస్తాడు. తనంతటి బలవంతుడు లేడనే ఆయన అహంభావాన్ని తొలగించడానికి అదే మంచి సమయమని అనుకుంటాడు. దారికి అడ్డుగా తన తోకను ఉంచి ఒక గట్టుపై కూర్చుంటాడు.
వృద్ధ వానరం దారికి అడ్డుగా తోకను ఉంచడం చూసి భీముడు అసహనానికి లోనవుతాడు. తోకను పక్కకి తొలగించమంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. ఆ వానరం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో, భీముడు కోపంతో ఆ తోకను పక్కకి తొలగించడానికి ప్రయత్నిస్తాడు. ఆ తోక అంగుళం కూడా కదలకపోవడంతో ఆశ్చర్యపోతాడు.
భీముడు తన బలాన్నంతటినీ ఉపయోగించినా ... ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోతుంది. దాంతో భీముడి అహంభావం పటాపంచలవుతుంది. తన ముందున్నది సామాన్యమైన వానరం కాదనీ ... సాక్షాత్తు హనుమంతుడని భీముడు గుర్తించి వినయంతో నమస్కరిస్తాడు. అప్పుడు హనుమంతుడు నిజరూప దర్శనమిస్తాడు. అహంభావాన్ని తొలగించుకున్న భీముడిని అనుగ్రహించి మరింత బలపరాక్రమాలను వరంగా ప్రసాదిస్తాడు.