స్వప్నంలో ఉదయించిన సూర్యుడు !
దేవతల కోరిక మేరకు ... మహర్షుల అభ్యర్థన మేరకు భగవంతుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అలా వెలసిన భగవంతుడు భక్తులకు తన ఉనికిని తెలియజేసి వెలుగులోకి వస్తుంటాడనేది అనేక క్షేత్రాల స్థలపురాణాలను బట్టి అర్థమవుతుంది.
సాధారణంగా రాముడు ... కృష్ణుడు ... వేంకటేశ్వరస్వామి ... నరసింహస్వామి ... శివుడు భక్తులకు స్వప్న దర్శనమిచ్చి వెలుగులోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి తమకి ఆలయాన్ని నిర్మించమని స్వప్నంలోనే భక్తులను ఆదేశించడం జరుగుతూ ఉంటుంది. అయితే సాక్షాత్తు లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు భక్తుల స్వప్నంలోకి రావడమనే కథనం మాత్రం చాలా అరుదుగా వినిపిస్తుంది.
అలాంటి అరుదైన సంఘటనకు నిదర్శనంగా 'నందికొట్కూరు' కనిపిస్తుంది. కర్నూలు జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రం ఆశ్చర్యచకితులను చేసే ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక చోళ రాజు ఈ ప్రదేశం మీదుగా వెళుతూ ఇక్కడ విశ్రమించడం జరిగిందట. ఆ సమయంలోనే సూర్యభగవానుడు ఆయనకి స్వప్నంలో దర్శనమిచ్చి, తనకి ఈ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించమని చెబుతాడు.
స్వామివారి ఆదేశం మేరకు ఆ రాజు ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించినట్టు స్థలపురాణంగా వినిపిస్తోంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉదయం వేళలో సూర్యకిరణాలు నేరుగా ఇక్కడి స్వామివారి పాదాలను తాకుతుంటాయి. అద్భుతమైన ఈ దృశ్యాన్ని చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు పెద్దసంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన సూర్యగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోయి, సకలశుభాలు చేకూరతాయని ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. అనేక విశేషాలకు ... మరెన్నో మహిమలకు నిలయంగా విలసిల్లుతోన్న ఈ క్షేత్రాన్ని చూసితీరవలసిందే.