అలా ఆమె అప్సరసల్లో చేరిపోయింది !
దైవాంశ సంభూతులుగా చెప్పబడుతోన్న నరనారాయణులు బదరికావనంలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. నరనారాయణుల తపోభూమి కావడం వలన ... వాళ్లు తపస్సు చేస్తున్నది లోక కల్యాణం కోసం కావడం వలన సామాన్య మానవులు అటువైపు తమ దృష్టి కూడా పడనీయకుండా జాగ్రత్త పడసాగారు. దాంతో నరనారాయణుల తపస్సు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతోంది.
నరనారాయణుల తపస్సు తీవ్రమవుతున్నా కొద్దీ దేవేంద్రుడికి అభద్రతా భావం ఎక్కువ కాసాగింది. దాంతో ఆయన వాళ్ల తపస్సుకి భంగం కలిగించమని చెప్పి అప్సరసలను పంపిస్తాడు. నరనారాయణుల తపోభూమికి చేరుకున్న అప్సరసలు, తమ ఆటపాటలతో వాళ్లను ఈ లోకంలోకి తీసుకురావడానికి ప్రయత్నించసాగారు. ఒక్కసారి కనులు తెరిచి చూస్తే తమ సౌందర్యానికి వాళ్లు వశులు కావలసిందేననే గర్వంతో ఉంటారు.
అలాంటి సమయంలోనే నారాయణుడు తన తొడ (ఊరువు) భాగాన్ని ఒకసారి చరుస్తాడు. అక్కడి నుంచి అద్భుతమైన సౌందర్యంతో ఒక యువతి ఆ అప్సరసల ముందుకి వస్తుంది. ఊరువు నుంచి ఆవిర్భవించినది కనుక 'ఊర్వశి' గా పిలవబడుతుంది. సౌందర్యవంతులమనే అతిశయంతో మిడిసిపడుతోన్న అప్సరసలు ఆ యువతి అందచందాలకు తాము సాటిరామని గ్రహించి సిగ్గుపడతారు.
తమకి మించిన సౌందర్యరాశిని సృష్టించిన వాళ్లు తమ వ్యామోహంలో పడటం అసాధ్యమనే విషయం అప్సరసలకు అర్థమైపోతుంది. దాంతో తమని క్షమించమని కోరుతూ నరనారాయణుల పాదాల చెంత వాలిపోతారు. శాంతమూర్తులైన నరనారాయణులు మన్నించగా వాళ్ల అనుమతితో ఊర్వశిని తమవెంట దేవలోకానికి తీసుకువెళతారు. అలా దేవలోకంలో స్థానాన్ని సంపాదించుకున్న ఊర్వశి, అప్సరసల్లో ముందువరుసలో కనిపిస్తుంది.