హనుమంతుడి వ్రతం అందించే ఫలితం !

అవసరాన్నిబట్టి ... అవకాశాన్నిబట్టి, బలాన్నీ ... బుద్ధిని ఉపయోగించి కార్యాన్ని సాధించుకురావడంలో హనుమంతుడికి గల నేర్పు అంతా ఇంతాకాదు. రాముడిని సేవించడం వలన కలిగే ఆనందం ఈ విశ్వంలో మరేదీ ఇవ్వలేదని చెప్పిన హనుమంతుడు, తనని సేవించే భక్తులకు కూడా అదే స్థాయి సంతోషాన్ని కలిగిస్తుంటాడు.

ఈ కారణంగానే అనేక ప్రాంతాలలో గల ఆయన క్షేత్రాలు నిత్యం భక్తుల రద్దీతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా అనారోగ్యాల కారణంగా బాధలుపడుతున్నవాళ్లు ... గ్రహ సంబంధమైన దోషాల వలన ఇబ్బందులను ఎదుర్కొంటున్నవాళ్లు ... విద్యా సంబంధమైన విషయంలో వెనుకబడుతోన్న వాళ్లు హనుమంతుడి క్షేత్రాలను దర్శిస్తుంటారు. ఆ స్వామి ఆశీస్సులను ... అనుగ్రహాన్ని కోరుతుంటారు.

అలాంటి సమస్యల నుంచి బయటపడటానికి 'హనుమద్ర్వతం' కూడా ఒక చక్కని మార్గమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది. 'మార్గశిర శుద్ధ ద్వాదశి' రోజున హనుమంతుడి వ్రతాన్ని ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ... పూజా మందిరంలో హనుమంతుడి వెండి ప్రతిమకు పూజాభిషేకాలు జరపవలసి ఉంటుంది. నియమనిష్టలను పాటిస్తూ వ్రతాన్ని పూర్తి చేసి, స్వామివారికి ఇష్టమైన అప్పాలను నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. ఇక దగ్గరలోని హనుమంతుడి ఆలయానికి వెళ్లి ఆ స్వామికి ఆకుపూజ చేయించి ... అప్పాలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన శారీరక మానసిక పరమైన రుగ్మతలు తొలగిపోతాయనీ, కార్యసిద్ధి కలగడమే కాకుండా ఆశించిన ప్రయోజనాలు నెరవేరతాయని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News