పూజా మందిరం ఎలా ఉండాలి ?

ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచడానికి తమవంతు ప్రయత్నం చేస్తుంటారు. ఇక పూజా మందిరం విషయానికి వచ్చేసరికి మరింత పవిత్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది పూజగది ప్రత్యేకంగా ఉండటానికి ఇష్టపడుతుంటారు. మరికొంతమంది వంటగదిలో భాగంగా పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.

దైవ సన్నిధానంగా భావించే ఆ ప్రదేశంలో తమ ఇష్టదైవానికి సంబంధించిన ప్రతిమను ప్రధానంగా పెడుతుంటారు. అలాగే వివిధ దేవతామూర్తుల చిత్రపటాలను కూడా అక్కడ ఉంచుతుంటారు. ప్రతినిత్యం పూజా మందిరాన్ని వివిధరకాల పుష్పాలతో అలంకరించి, భక్తిశ్రద్ధలతో ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తుంటారు. అయితే పూజామందిరం దగ్గర కూర్చుని పూజ పూర్తిచేసిన తరువాత ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోతుండటం జరుగుతూ ఉంటుంది.

దాంతో దీపారాధన కొండెక్కిన తరువాత పూజా మందిరంగానీ ... పూజగది గాని చీకటిగా ఉండటం జరుగుతూ ఉంటుంది. అలాగే సాయంకాలం దీపారాధన చేసిన తరువాత కూడా ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమై మరునాడు ఉదయం వరకూ ఆ వైపు దృష్టి పెట్టకపోవడం జరుగుతూ ఉంటుంది. దాంతో దీపం కొండెక్కిన తరువాత ఆ రాత్రంతా కూడా పూజా మందిరం చీకటిగానే ఉండటం జరుగుతూ ఉంటుంది.

ఆధ్యాత్మిక గ్రంధాలు మాత్రం ... పూజా మందిరంలో చీకటి అలుముకుని ఉండకూడదని చెబుతున్నాయి. పూజా మందిరంగానీ పూజ గది గాని చీకటిగా ఉండటం వలన అనేక అనర్థాలు జరుగుతాయని స్పష్టం చేస్తున్నాయి. ఈ కారణంగానే కొంతమంది తమ ఇంట్లో అఖండ దీపారాధనకు ఏర్పాటు చేస్కుంటూ ఉంటారు. కాస్తంత ఓపిక ... తీరిక ఉన్నవాళ్లు దీపారాధన కొండెక్కకుండా చూసుకోవచ్చు. అవకాశం లేనప్పుడు పూజ గదిలోను ... పూజా మందిరంలోను నిరంతరం విద్యుత్ దీపాలు వెలిగే ఏర్పాట్లు చేసుకోవచ్చు.

ఈ విధంగా చేయడం వలన, పూజామందిరాన్ని చీకటిలో ఉంచడం వలన కలిగే దోషాల నుంచి బయటపడవచ్చు. అనునిత్యం ఎవరి ఇంటనైతే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట కొలువై ఉండటానికి లక్ష్మీదేవి ఆసక్తిని చూపిస్తుందనే విషయాన్ని మరిచిపోకూడదు.


More Bhakti News