మంచికి తోడుగా నిలిచే భగవంతుడు

పాండవులు అరణ్యవాసం చేస్తూ ఒక గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఓ బ్రాహ్మణుడి ఇంటిముందు జనం గుమిగూడి ఉండటం కుంతీదేవి చూస్తుంది. ఆ బ్రాహ్మణుడి కుటుంబసభ్యులు ఆవేదనతో ఉండటం చూసి విషయమేవిటని అక్కడివారిని అడుగుతుంది.

బకాసురుడు అనే రాక్షసుడు ఆ గ్రామం పొలిమేరల్లోని గుట్టలను నివాసస్థానంగా చేసుకున్నాడనీ, రోజుకో ఇంటి నుంచి ఒక వ్యక్తి బండెడు అన్నం తీసుకుని అతని దగ్గరికి వెళ్లాలనీ ... అలా వెళ్లిన వ్యక్తితో పాటు వాడు ఆ భోజనాన్ని ఆరగిస్తాడని చెబుతారు. నియమం ప్రకారం ఆ రోజు ఆ బ్రాహ్మణ కుటుంబీకుల వంతు వచ్చిందని అంటారు.

తల్లిదండ్రులను ఓదార్చిన ఆ బ్రాహ్మణ దంపతుల కుమారుడు బకాసురుడికి బలి కావడానికి బయలుదేరుతుంటాడు. ఒక్కగానొక్క కొడుకుని చేతులారా మృత్యుముఖంలోకి పంపించలేక ఆదంపతులు బాధతో తల్లడిల్లిపోతుంటారు. ఆ దృశ్యం చూసిన కుంతీదేవి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తనకి భగవంతుడు అయిదుగురు బిడ్డలను ఇచ్చాడనీ .. అందులో ఒకరిని బకాసురుడి చెంతకి పంపిస్తానని ఆ బ్రాహ్మణ దంపతులతో చెబుతుంది.

ఆ దంపతులకి నచ్చజెప్పి భీముడిని బకాసురుడి దగ్గరికి పంపిస్తుంది. కుంతీదేవి తీసుకున్న నిర్ణయం ... ఆమె త్యాగం శ్రీకృష్ణుడికి తెలిసిపోతుంది. భీముడు మహాబల సంపన్నుడే అయినా, కుంతీదేవి త్యాగ ఫలితంగా లోకానికి మంచి జరగాలనే ఉద్దేశంతో భీముడిని అనుగ్రహిస్తాడు. దాంతో భీముడి చేతిలో బకాసురుడు ప్రాణాలు కోల్పోతాడు. బకాసురుడి పీడా విరగడైందనే విషయం గ్రామస్తులకు తెలిసిపోతుంది. ఏ తల్లికీ కడుపుకోత లేకుండా చేసిన కుంతీదేవికి కృతజ్ఞతలు తెలుపుకుని సంతోషంతో సంబరాలు జరుపుకుంటారు.


More Bhakti News