శుభాలను ప్రసాదించే శంకరుడు

మహాదేవుడు మనసున్నవాడు ... పిలిస్తే పలుకుతాడు ... కొలిస్తే కరిగిపోతాడు. అభిషేకం చేస్తే ఆనందపడిపోతాడు ... మారేడు దళం సమర్పిస్తే చాలు మహా సంతోషపడిపోతాడు. భక్తుల సేవలను అందుకుంటూ .. అనుక్షణం వాళ్లను కాపాడుతూ ఉండటమే ఆయనకి ఇష్టం. అందువల్లనే అనేక ప్రాంతాల్లో ఆ స్వామి ఆవిర్భవిస్తున్నాడు ... అనుగ్రహిస్తున్నాడు.

అలా ఆ స్వామి కొలువైన క్షేత్రాల్లో ఒకటిగా 'అమ్మపేట' కనిపిస్తుంది. ఈ గ్రామం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పరిధిలోకి వస్తుంది. అమ్మవారి సమేతంగా ఇక్కడి కొండపై వేంకటేశ్వరస్వామి ఆవిర్భవించడం వలన ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చిందని చెబుతారు. గ్రామానికి ఒక చివరన వేంకటేశ్వరస్వామి ఆలయం దర్శనమిస్తూ ఉండగా, మరో చివరన శివాలయం కనిపిస్తుంది. అలా ఇది శివకేశవ క్షేత్రంగా విలసిల్లుతోంది.

ఇక్కడి శివుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడినవాడిగా చెబుతుంటారు. ప్రాచీన కాలానికి చెందినవాడే అయినా అందుకు సంబంధించిన ఆధారాలు కనిపించవు. గ్రామస్తులు మాత్రం తరతరాలుగా ఇక్కడి శివయ్యను ప్రేమానురాగాలతో పూజిస్తూ ఉంటారు ... భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తుంటారు. మంచుకొండల నడుమ ఉండే శివయ్య మనసు కూడా మంచులాంటిదేననీ, అందువల్లనే అడిగిన వరాలను ఆయన ఆలస్యం చేయకుండా అనుగ్రహిస్తూ ఉంటాడని చెబుతుంటారు.

ప్రతి సోమవారం రోజున ... కార్తీక మాసంలోను ... మహా శివరాత్రి పర్వదినం సందర్భంగాను ఇక్కడ ప్రత్యేక పూజలు ... విశేషమైన సేవలు జరుగుతుంటాయి. ఈ సందర్భంగా భక్తులంతా స్వామివారిని పెద్దసంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు. ఆ స్వామి కృపా కటాక్షాలను కోరుతుంటారు.


More Bhakti News