విగ్రహ రూపంలో దర్శనమిచ్చే శివుడు !
సాధారణంగా ఏ శైవక్షేత్రానికి వెళ్లినా అక్కడి శివుడు లింగాకారంలోనే దర్శనమిస్తూ ఉంటాడు. అనునిత్యం పూజాభిషేకాలు అందుకుంటూ అనుగ్రహిస్తుంటాడు. అలాంటిది ఒకానొక క్షేత్రంలో మాత్రం ఆ దేవదేవుడు విగ్రహ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఆ క్షేత్రమే .. యాగంటి. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధిచెందిన ప్రాచీన శివాలయాలలో యాగంటి ఒకటిగా కనిపిస్తుంది.
ఎక్కడ చూసినా లింగాకారంలో కనిపించే శివుడు, ఇక్కడ విగ్రహ రూపంలో .. అదీ ఉమా సమేతంగా దర్శనమిస్తూ ఉండటం ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకు కారణమేవిటో తెలుసుకోవాలనిపిస్తుంది. పూర్వం ఈ ప్రదేశానికి చేరుకున్న అగస్త్య మహర్షి ఇక్కడ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటాడు.
విగ్రహాన్ని రూపొందిస్తోన్న సమయంలో అంతరాయాలు కలుగుతూ ఉండటంతో, విషయమేవిటో తెలుసుకోవడం కోసం శివుడిని ప్రార్ధిస్తాడు. అప్పుడు ఆదిదేవుడు ప్రత్యక్షమై, వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని పూర్తిచేయలేకపోయినందుకు బాధపడవద్దనీ, తాను విగ్రహ రూపంలోనే ఉమాసమేతంగా అక్కడ ఆవిర్భవిస్తున్నాననీ చెబుతాడు. అలా ఏకశిలపై ఇక్కడ ఉమామహేశ్వరులు దర్శనమిస్తూ ఉంటారు. తమ అనుగ్రహాన్ని కోరిన భక్తులను కరుణిస్తూ ... కాపాడుతూ ఉంటారు.