ఏకాదశి రోజున విష్ణుపూజా ఫలితం !
వైష్ణవ సంబంధమైన కొన్ని క్షేత్రాల్లో ప్రతి ఏకాదశి రోజున 'ఏకాదశి వ్రతం' నిర్వహిస్తుంటారు. ఈ రోజున విష్ణుమూర్తిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఆ స్వామిని సేవిస్తూ ... పరవశంతో ఆయన భజనలు చేస్తూ జాగరణ చేస్తుంటారు. ఏకాదశి రోజున ఉపవాస జాగరణలతో వ్రతాన్ని ఆచరించినవారికి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో మార్గశిర శుద్ధ ఏకాదశి మరింత ప్రత్యేకతను ... విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. మార్గశిర శుద్ధ ఏకాదశిని 'మోక్షదా ఏకాదశి' గా చెబుతుంటారు. ఈ వ్రతాన్ని భక్తులు ఇంటి దగ్గర ఆచరిస్తుంటారు ... ఆలయాలలో జరుపుతుంటారు. ఈ వ్రత ఫలితం వలన సకల శుభాలు కలగడమే కాదు ... అందరూ కోరుకునే 'మోక్షం' లభిస్తుంది.
సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవితో ఈ వ్రత మహాత్మ్యాన్ని గురించి చెప్పాడట. అలాంటి ఈ వ్రతాన్ని ఎంతోమంది మహర్షులు ... మహారాజులు ఆచరించి తరించారు. ఈ రోజున సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరిస్తుంటారు. వాకిట్లో ముగ్గుపెట్టి ... ద్వారానికి మామిడి తోరణాలు కట్టి ... గుమ్మానికి పసుపురాసి కుంకుమ బొట్లు పెడుతుంటారు. పూజా మందిరంలో శ్రీమహా విష్ణువు వెండి ప్రతిమకు అంకితభావంతో పూజాభిషేకాలు జరుపుతుంటారు.
ఉపవాస దీక్షను చేపట్టి ... జాగరణకి సిద్ధపడుతూ వ్రత సంబంధమైన అన్ని నియమాలను పాటిస్తారు. మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే శ్రీమహావిష్ణువును ఆరాధించి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ఇలా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన సమస్త దోషాలు ... పాపాలు నశిస్తాయి. సమస్యలన్నీ తొలగిపోయి సకల సంపదలు చేకూరతాయి. ఏ మోక్షాన్ని పొందడం పరమార్థమని పురాణాలు చెబుతున్నాయో, ఆ మోక్షం ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం వలన లభిస్తుందని స్పష్టం చేస్తున్నాయి.