అమ్మవారి ఆవిర్భావం ఆసక్తికరం !
గుంటూరు జిల్లా ప్రజలకు ... ఆ చుట్టుపక్కల ప్రాంతాలవారికి 'నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారు' గురించి తెలియకుండా ఉండదు. ఎందుకంటే ప్రతి ఆదివారం ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. 'అడిగొప్పుల' గ్రామంలో గల ఈ అమ్మవారి సన్నిధిలో ఒక రాత్రి నిద్ర చేస్తుంటారు.
ఇక్కడి అమ్మవారి సన్నిధిలో నిద్రచేస్తే తప్పకుండా సంతానం కలుగుతుందనే విశ్వాసం భక్తులలో బలంగా కనిపిస్తుంటుంది. ఈ కారణంగా సంతాన భాగ్యాన్ని ఆశించి ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీ అమ్మవారిగా శిలారూపంలో ఇక్కడ పూజలు అందుకుంటోన్న యువతి, శాపవశాత్తు మానవ జన్మయెత్తిన పార్వతీదేవి అని స్థలపురాణం చెబుతోంది.
ఒకసారి కైలాసంలో ప్రమథ గణాలు నాట్యం చేస్తూ ఉండగా పార్వతీ పరమేశ్వరులు తిలకించసాగారట. నందీశ్వరుడు నాట్యం చేసే తీరు అమ్మవారికి హాస్యంగా అనిపించడంతో నవ్వుతుంది. ఆ విషయాన్ని నందీశ్వరుడు పెద్దగా పట్టించుకోడు కానీ ఆయన తండ్రి 'శిలాదుడు' కి కోపాన్ని కలిగిస్తుంది. తన కుమారుడిపట్ల అవమానకరంగా ప్రవర్తించిన ఆమె ప్రతిఫలాన్ని అనుభవించా లనుకుంటాడు.
భూలోకంలో మానవ దంపతులకు జన్మించి ... ఒకానొక సంఘటన కారణంగా అనుమానించబడి ఆ కారణంగా తనువు చాలించి ఆ తరువాత శిలారూపంలో పూజలు అందుకోమని శపిస్తాడు. అలా శిలాదుడి శాపం కారణంగానే అమ్మవారు ఇక్కడ ఇలా ఆవిర్భవించిందని అంటారు. లక్ష్మీ పేరుతో జన్మించిన పార్వతీదేవి కనుక, ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఇద్దరి అమ్మవార్లను సేవించిన ఫలితం దక్కుతుందని అంటారు.
ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటే సంపదలు ... సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వసిస్తుంటారు. అటు పురాణ సంబంధమైన కథనం ... దానితో ముడిపడిన జానపదుల కథనం ... వాటిని నిజం చేస్తూ ఇక్కడి అమ్మవారు చూపే మహిమలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. అందువలన ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా చెప్పబడుతోంది.