బాధలను తీర్చేటి వేంకటేశ్వరుడు
భక్తుల మధ్య ఉంటూ .. వాళ్ల బాధలను తీరుస్తూ ఉండటం కోసమే వేంకటేశ్వరుడు తిరుమల కొండలను మరో వైకుంఠంగా తీర్చిదిద్దుకున్నాడు. తన దర్శనం కోసం రావాలని భక్తులు సంకల్పించుకున్న క్షణం నుంచి, తన దర్శనం అనంతరం తిరిగి వాళ్లు తమ నివాసానికి చేరుకునేంత వరకూ ఆయన బాధ్యత వహిస్తుంటాడని అంటారు.
సాక్షాత్తు అక్కడ కొలువైంది ప్రత్యక్ష నారాయణుడే కనుక, ఎన్ని కష్టాలు ఎదురైనా లెక్కచేయక భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఆయన దివ్యమంగళ మోహన రూపాన్ని చూసి తరించిపోతుంటారు. అలాంటి స్వామి దర్శన భాగ్యం అనునిత్యం తమకి లభించాలనే ఉద్దేశంతో స్వామి ఆలయాన్ని నిర్మింపజేసుకున్న భక్తులు ఎంతోమంది ఉన్నారు.
అలా ఒక భక్తురాలి సంకల్ప బలం కారణంగా నిర్మించబడిన వేంకటేశ్వరస్వామి ఆలయం ఖమ్మంలో కనిపిస్తుంది. ఖమ్మం - కాలువ గట్టు సమీపంలో గల ఈ ఆలయంలో శ్రీదేవి - భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దర్శనమిస్తూ ఉంటాడు. గర్భాలయంలో స్వామివారి ధృవమూర్తి కళకళలాడుతూ కనిపిస్తుంది. గర్భాలయానికి రెండువైపులా గల ప్రత్యేక మందిరాల్లో అమ్మవార్లు కొలువై ఉంటారు.
చాలాకాలం క్రితం నిర్మించబడిన ఆలయం కావడం వలన ... ఇక్కడి స్వామివారి మహిమలు అనుభవంలోకి రావడం వలన భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ప్రతి శనివారం ... పర్వదినాల్లోను ... ధనుర్మాసంలోను ప్రత్యేక పూజలు .. అలంకారాలు ... సేవలు జరుగుతుంటాయి. ఇక్కడి స్వామివారిని దర్శించుకుని బాధలు చెప్పుకుంటే అవి మబ్బు తెప్పల్లా తెలిపోతాయని చెబుతుంటారు.
అలా ఆ స్వామికి చెప్పుకుని ఎన్నో బాధల నుంచి బయటపడిన వాళ్లు ఎంతోమంది ఉన్నారని అంటారు. స్వామివారి మహిమలకు ... భక్తి విశ్వాసాలకు ప్రతీకగా కనిపిస్తోన్న ఈ ఆలయ దర్శనం అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందని చెప్పవచ్చు.