పాతివ్రత్య మహిమ అలాంటిది !

స్త్రీకి పతిసేవకి మించిన పరమార్థం లేదని పురాణాలు చెబుతున్నాయి. ఆమె పాతివ్రత్యమే సదా ఆమెనీ ఆమె కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటుందని చెప్పబడుతోంది. పాతివ్రత్యమే ఆయుధంగా దేవతల శక్తిని సైతం ఎదిరించిన పతివ్రతలు ఎంతోమంది ఉన్నారు. పతివ్రతలకు అసాధ్యమైనది లేదని వాళ్లు ఈ లోకానికి చాటిచెప్పారు.

సీత ... సావిత్రి ... అనసూయ ... అరుంధతి ... రేణుకాదేవి ... సుకన్య ... సులోచన ... ఇలా ఎంతోమంది పతివ్రతలు తమ పాతివ్రత్య మహిమను ఈ లోకానికి తెలియజెప్పారు. సీత నుంచున్న నేలను పెకిలించి రావణుడు ఆమెను అపహరించాడు. ఆమె పాతివ్రత్యం కారణంగా ఆమె సమీపానికి కూడా రాలేకపోయాడు. లంకాదహన సమయంలో సీతమ్మ ... అగ్ని దేవుడిని ప్రార్ధించడం వలన, హనుమంతుడికి తోక కాలుతున్నా ఆయనకి బాధ తెలియకుండా పోతుంది.

ఇక సావిత్రి తన పాతివ్రత్యంతో యమధర్మరాజును సైతం ఎదిరించి తన భర్తను బతికించుకుంటుంది. అనసూయాదేవి తన పాతివ్రత్యంతో నారద మహర్షికి గులక రాళ్లను గుగ్గిళ్లుగా వండి పెడుతుంది. తనని పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను పసిపిల్లలను చేసి పాలిస్తుంది. ఇక వశిష్ఠ మహర్షి భార్య అరుంధతి ఇసుకతో అన్నం వండి ఆశ్రమవాసుల ఆకలి తీరుస్తుంది.

జమదగ్ని భార్య ... పరశురాముడి తల్లి అయిన రేణుకాదేవి, తన పాతివ్రత్యంతో ప్రతిరోజు ఇసుకతో కుండను తయారుచేసి అందులో నీటిని తీసుకుని ఆశ్రమానికి వచ్చేది. మహా పతివ్రత అయిన సుకన్య ... దేవేంద్రుడి శాపం కారణంగా గాడిదలుగా మారిపోయిన అశ్వనీదేవతలకు పూర్వరూపాన్ని తీసుకువస్తుంది.

ఇక నాగరాజు కుమార్తె ... మేఘనాథుడి భార్య అయిన సులోచన మహాపతివ్రత. లక్ష్మణుడితో మేఘనాథుడు తలపడుతోన్న సమయంలోనే మేఘనాథుడికి మృత్యువు ఆసన్నమవుతుంది. ఆయన ప్రాణాలను తీసుకువెళ్లడానికి యమధర్మరాజు బయలుదేరుతాడు. ఈ విషయాన్ని గ్రహించిన సులోచన తన చేతి గాజులను భర్తకి రక్షణ వలయంగా చేస్తుంది.

ఆమె గాజులను దాటుకుని యమపాశం మేఘనాథుడిని చేరుకోలేకపోతుంది. దాంతో చేసేది లేక యమధర్మరాజు వెనుదిరగవలసి వస్తుంది. ఇలా ఎంతోమంది మహాపతివ్రతల పాద స్పర్శచే ఈ నేల పునీతమైంది. వారి పాతివ్రత్యం మహిళా లోకానికి ఆదర్శప్రాయమైంది.


More Bhakti News