అహంకారానికి ఫలితం అవమానమే !
నరనారాయణులు 'గంధమాదన పర్వతం' పై తపస్సు చేసుకుంటూ ఉంటారు. జనసంచారానికి దూరంగా ... పర్వతభాగాన వాళ్ల తపస్సు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రశాంతంగా సాగిపోతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో 'దంబోద్భవుడు' అనే రాజు తన సైనికబలంతో నరనారాయణులు తపస్సు చేసుకుంటోన్న ప్రదేశానికి చేరుకుంటాడు.
ఆయన తమ యోగక్షేమాలు తెలుసుకోవడానికి వచ్చాడనుకుని నరనారాయణులు మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలుకుతారు. వారి ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ తను వచ్చింది యుద్ధం చేయడానికని చెబుతాడు దంబోద్భవుడు. ఆ మాటకి నరనారాయణులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. ప్రశాంతంగా తపస్సు చేసుకుంటోన్న తమతో యుద్ధం చేయడం వలన ఆయనకి కలిగే ప్రయోజనం ఏమీ ఉండదనీ, తమ ఆతిథ్యం స్వీకరించి వెళ్లమని కోరతారు.
తనకంటే పరాక్రమవంతులు ఎవరూ లేరనే భావనతో తాను ఇంతకాలంగా సంతోషంగా ఉన్నానని దంబోద్భవుడు అంటాడు. వాళ్ల బలపరాక్రమాలను గురించి విన్న దగ్గర నుంచి, వాళ్లను జయించాలని ఆరాటపడుతున్నానని చెబుతాడు. కనుక ఈ విషయంలో తనకి నచ్చజెప్పే ప్రయత్నం చేయకుండా రంగంలోకి దిగమని అంటాడు.
అహంభావంతో మిడిసిపడుతోన్న ఆయనకి ఇక మాటలతో చెప్పడం వలన ప్రయోజనం ఉండదనే విషయం నరనారాయణులకు అర్థమైపోతుంది. దంబోద్భవుడు అతని సేన నరనారాయణులపై బాణాలు సంధించడానికి సిద్ధపడతారు. తమకి ఎలాంటి అస్త్ర శస్త్రాలు అవసరంలేదనీ, వాళ్ల సమస్త సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఒక్క 'దర్భ' చాలని చెబుతూ నరుడు దానిని వారిపైకి ప్రయోగిస్తాడు. దాని ధాటికి తట్టుకోలేక ఎక్కడి వాళ్లు అక్కడే కుప్పకూలిపోతారు.
ఆ దృశ్యం చూసిన దంబోద్భవుడు నిర్ఘాంతపోతాడు. వాళ్ల శక్తి సామర్థ్యాలను గ్రహించిన ఆయన నరనారాయణుల పాదాలపై పడతాడు. అజ్ఞానంతో తాను చేసిన పొరపాటుకు మన్నించవలసిందిగా కోరతాడు. పరాక్రమాన్ని ప్రదర్శించవలసింది సజ్జనులపై కాదనీ, అహంభావానికి ఫలితంగా అవమానమే దక్కుతుందని తెలుసుకుని అక్కడి నుంచి వెనుదిరుగుతాడు.