కార్యసిద్ధిని కలిగించే హనుమంతుడు

తలపెట్టిన కార్యం పూర్తయ్యేంత వరకూ విశ్రమించనివాడిగా హనుమంతుడు కనిపిస్తాడు. రావణుడు అపహరించిన సీతమ్మవారిని అన్వేషించడంలో ఆయన పోషించిన పాత్రే అందుకు నిలువెత్తు నిదర్శనం. శ్రీరాముడి ఆవేదనను హనుమంతుడు అర్థం చేసుకుంటాడు. అవతల సీతమ్మతల్లి ఎంతలా తల్లడిల్లిపోతుందో ఊహిస్తాడు.

సీతారాముల ఆవేదనను దూరం చేయాలని నిర్ణయించుకున్న ఆయన, ఆ కార్యం పూర్తయ్యేంతవరకూ విశ్రమించడు. అలాగే తనని విశ్వసిస్తూ తన భక్తులు ఆరంభించే కార్యాలు కూడా సిద్ధించేలా ఆయన చేస్తుంటాడు. తన భక్తులు తలపెట్టిన కార్యాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూస్తుంటాడు. అలా కార్యసిద్ధిని కలిగించే అభయ వీరాంజనేయస్వామి 'సూరయ పాలెం' లో దర్శనమిస్తూ ఉంటాడు.

కృష్ణా జిల్లా గొల్లపూడి మండలంలో ఈ క్షేత్రం అలరారుతోంది. కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడి హనుమంతుడు పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఇంతటి ప్రాచీనతను కలిగిన హనుమంతుడి గురించిన ఆధారాలు లభించకపోవడం వలన, ఈ క్షేత్రాన్ని గురించిన పూర్తి వివరాలు తెలియవు. అయితే హనుమంతుడి మహిమలు భక్తుల అనుభవాలుగా వెలుగు చూస్తుండటం వలన ఆదరణ పెరుగుతూ వస్తోంది.

విద్యా .. ఉద్యోగం ... వ్యాపారం ... శుభకార్యం ఇలా ఏ పని ఆరంభిస్తున్నా, ఇక్కడి హనుమంతుడికి చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఆశీస్సుల వలన తలపెట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయని విశ్వసిస్తుంటారు. విశేషమైటువంటి పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు ... సేవలు జరుగుతుంటాయి. ఈ సందర్భంగా స్వామివారిని ఇక్కడి వాళ్లంతా దర్శించుకుంటూ వుంటారు. అనుక్షణం తమకి అండగా నిలుస్తోన్న ఆ స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు.


More Bhakti News