సుబ్రహ్మణ్యుడికి ఇలా మొక్కులు చెల్లిస్తారు
మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి ... మల్లాం సుబ్రహ్మణ్యస్వామి ... కుక్కె సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాలను గురించి తెలుసుకుంటే, ఈ ప్రదేశాల్లో తపస్సు చేసుకున్నస్వామి ఆ తరువాత కాలంలో వెలుగులోకి వచ్చినట్టుగా స్థలపురాణం చెబుతోంది.
ఇక 'ఘాటి సుబ్రహ్మణ్యస్వామి' క్షేత్ర నేపథ్యం విషయానికి వస్తే, ఈ ప్రదేశంలో 'ఘటికాచలుడు' అనే అసురుడిని సంహరించిన స్వామి, దేవతల కోరికపై ఇక్కడ ఆవిర్భవించాడు. ఆ తరువాత కాలంలో ఒక భక్తుడికి తన ఉనికిని తెలియజేసిన స్వామి వెలుగులోకి రావడం జరిగింది. కర్ణాటక ప్రాంతానికి చెందిన విశిష్టమైన సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాల్లో ఇది ఒకటిగా విలసిల్లుతోంది.
ఘటికాచలుడు అనే అసురుడిని స్వామివారు ఈ ప్రదేశంలో సంహరించిన కారణంగానే ఈ క్షేత్రంలోని స్వామివారిని ఘాటి సుబ్రహ్మణ్యస్వామిగా కొలుస్తుంటారు. ఒక్కో క్షేత్రంలో స్వామి వెలుగు చూసినతీరు ఆ స్వామి మహాత్మ్యానికి అద్దంపడుతుంటాయి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి.
స్వామివారు ఎక్కడ ఆవిర్భవించినా ఆ స్వామి అనుగ్రహంతో సర్పదోషాలు ... గ్రహ సంబంధమైన దోషాలు ... అనారోగ్యాలు తొలగిపోతాయనీ, సంతాన సౌభాగ్యాలు నిలుస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. స్వామివారిపట్ల విశ్వాసంతో మొక్కుకునేవారు ... కృతజ్ఞతలతో మొక్కుబడులు చెల్లించుకునేవారు ఈ క్షేత్రాల్లో కనిపిస్తుంటారు.
ఒక్కో క్షేత్రంలో భక్తులు స్వామివారికి మొక్కుబడులు చెల్లించే పద్ధతి ఒక్కోలా ఉంటుంది. మోపిదేవి క్షేత్రంలో 'ఉయ్యాల ఊపు' మొక్కు ప్రధానమైనదిగా కనిపిస్తుంది. ఇతర సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో స్వామివారికి 'వెండి కళ్లు' ... 'వెండి పడగలు' మొక్కుబడిగా చెల్లిస్తుండటం ఎక్కువగా ఉంటుంది. ఇక ఘాటి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రంలో 'తులాభారం' ద్వారా మొక్కుబడులు చెల్లించుకోవడం ప్రధానంగా కనిపిస్తుంది.
స్వామివారికి బెల్లం ... అరటిపండ్లు ఇష్టమైన నైవేద్యాలుగా చెబుతుంటారు. అందువలన తులాభారం తూగి తమ బరువుకి తగిన బెల్లం ... అరటి పండ్లను మొక్కుబడిగా స్వామివారికి చెల్లిస్తుంటారు. ఆయన చల్లని చూపు సదా తమపై ఉండాలని కోరుకుంటూ ఉంటారు.