స్వామివారు ఇక్కడ నిద్రిస్తారట !
శ్రీనివాసుడి లీలావిశేషాలు అన్నీఇన్నీ కావు. ఆయన ఎక్కడ కొలువై ఉంటే అక్కడ వైకుంఠమనిపిస్తుంది. ఎలాంటి అలంకారం లేకపోయినా ఆయనకి మించిన సౌందర్యం లేదనిపిస్తుంది. ఆయన ఏ వాహన సేవపై కదలివస్తోన్న ఆనంద భాష్పాలనురాల్చని కన్నులుండవనిపిస్తుంది. ఆయన ఏ సేవను పొందుతున్నా అంతకుమించిన వైభవం లేదనిపిస్తుంది. ఆ విశ్వమోహనాకారాన్ని దర్శించి ధన్యులు కానివారు ఎవరుంటారనిపిస్తుంది.
అలా దర్శన మాత్రంచేతనే మంత్రముగ్ధులను చేసే స్వామివారు మనకి 'ఉపమాక' క్షేత్రంలో దర్శనమిస్తూ ఉంటాడు. విశాఖ జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రం, వేంకటేశ్వరుడు స్వయంభువుగా ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రంగా చెప్పబడుతోంది. ఈ క్షేత్రంలో స్వామి ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని విశ్వసిస్తూ ఉంటారు.అందువలన రాత్రి సమయాల్లో స్వామివారికి నిద్రాభంగం కలగకుండా ఎంతగానో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.
కృతయుగం నాటికే స్వామివారు ఇక్కడ ఆవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది. వైకుంఠం నుంచి దిగివచ్చిన స్వామి ఇక్కడి గరుడాద్రిపై ఒక పాదాన్ని మోపారట. ఆ బరువును తట్టుకోలేక ఈ పర్వతం కుంగిపోతుండటంతో, స్వామివారు రెండో పాదాన్ని ఏడుకొండలపై మోపినట్టుగా చెబుతుంటారు. అలా ఏడుకొండలపై వెలసిన దేవుడు రాత్రి వేళ పవళించే సమయానికి ఉపమాక వస్తాడనే బలమైన విశ్వాసం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది.
ఈ కారణంగానే స్వామి పవళింపుకి ఇక్కడ ప్రత్యేక ప్రాధాన్యత కనిపిస్తూ ఉంటుంది. స్వామివారి పవళింపుకి కావలసిన ఏర్పాట్లను చేసిన అర్చకులు కొండదిగి వచ్చేస్తుంటారు. శ్రీనివాసుడు ఒక పాదాన్ని ఉపమాకలో ... మరోపాదాన్ని తిరుమలలో మోపిన కారణంగా, తిరుమల తరువాత అంతటి మహాత్మ్యం కలిగిన స్వామివారిగా ఉపమాక వేంకటేశ్వరుడు కనిపిస్తాడు. తన లీలావిశేషాలతో భక్తజనులను సమ్మోహితులను చేస్తుంటాడు.