మహిమాన్వితుడు ఇక్కడి సుబ్రహ్మణ్యుడు

తమిళనాడు ప్రాంతంలో సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో స్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలు భక్తుల పాలిట కొంగుబంగారంగా చెప్పబడుతున్నాయి. ఒక్కోక్షేత్రం ఒక్కో విశేషాన్ని సంతరించుకుని విలసిల్లుతున్నాయి. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటి 'తిరుచ్చెందూరు'.

సముద్రతీరానికి సమీపంలో ఈ క్షేత్రం దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడనడానికి అనేక నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి స్వామి మహిమల గురించి భక్తులు కథలుకథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ఒక యథార్థ సంఘటనలోకి వెళితే ... సుబ్రహ్మణ్యస్వామిని అనునిత్యం ఆరాధించే దంపతుల గురించి తెలుస్తుంది.

స్వామి భక్తులైన ఆ దంపతులకు పుత్రసంతానం కలుగుతుంది. వారసుడు కలిగాడనే ఆ దంపతుల సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. ఆ పిల్లవాడు మూగవాడని తెలిసి బాధతో ఆ దంపతులు తల్లడిల్లిపోతారు. తమ ఇష్టదైవం సుబ్రహ్మణ్యుడే కనికరించాలని భావించి, ఆ పిల్లవాడిని తీసుకుని 'తిరుచ్చెందూరు' క్షేత్రానికి చేరుకుంటారు. పిల్లవాడికి స్వామి దర్శనం చేయించి, ఆయనకి తమ ఆవేదనను చెప్పుకుంటారు. తమ పిల్లవాడికి మాట వచ్చేంతవరకూ ఆ క్షేత్రాన్ని విడిచి వెళ్లేది లేదంటూ అక్కడే ఉండిపోతారు.

చల్లని మనసున్న స్వామి కరుణించడంతో ఆ పిల్లవాడికి మాట వస్తుంది. ఇలా స్వామివారు చూపిన ఎన్నో మహిమలను గురించి ఈ క్షేత్రంలో వినిపిస్తుంటాయి. ఆ స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడనే నిదర్శనాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంటాయి.


More Bhakti News