స్వయంభువు సుబ్రహ్మణ్యుడి దర్శనభాగ్యం

సంతానలేమితో బాధపడుతోన్నవారికీ ... చర్మసంబంధమైన వ్యాధులతో సతమతమైపోతున్నవారికీ, నాగదోషాలతోను ... గ్రహసంబంధమైన దోషాలతోను బాధలుపడుతోన్నవారికి... విద్యలో అభివృద్ధిని సాధించలేకపోతున్నవారికి సుబ్రహ్మణ్య షష్ఠి ఒక వరమని చెప్పవచ్చు. ఈ సమస్యలన్నీ కూడా సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో తొలగిపోతాయి.

స్వామి అనుగ్రహం ఆయన అవతరించిన రోజుగా చెప్పబడుతోన్న 'మార్గశిర శుద్ధ షష్ఠి' రోజున వెంటనే లభిస్తుందని చెప్పబడుతోంది. ఈ రోజున సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు భక్తజన సందోహంతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా స్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలకు ... నదీతీరంలో గల క్షేత్రాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా 'నడిపూడి' కనిపిస్తుంది.

తూర్పుగోదావరి జిల్లా అమాలాపురానికి సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ప్రాచీనకాలం నుంచి ఇక్కడ స్వయంభువు సుబ్రహ్మణ్యస్వామి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. గోదావరి నదీతీరంలో గల ఈ క్షేత్రానికి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామివారికి పూజాభిషేకాలు జరిపించి తరిస్తుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ క్షేత్రంలో తప్పనిసరిగా ఒక సర్పం భక్తులకు దర్శనమిస్తుందని చెబుతుంటారు.

ఈ రోజున తెల్లవారు జామున ఆలయానికి చేరుకున్న భక్తులకు శిఖరంపై సర్పం దర్శనమిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు. స్వామియే సర్పరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నట్టుగా వాళ్లు విశ్వసిస్తుంటారు. ఇక్కడి స్వామిని దర్శించడం వలన సమస్త దోషాలు నశించి సకల శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. ఈ రోజున ఈ క్షేత్రంలో స్వామికి మొక్కుబడులు చెల్లించేవాళ్లను చూస్తే, స్వామి ఎంతటి మహిమాన్వితుడో అర్థమైపోతుంది. ఈ క్షేత్రంలో అడుగుపెట్టినవాళ్లు స్వామి అనుగ్రహాన్ని పొందకుండా వెనుదిరగరని స్పష్టమైపోతుంది.


More Bhakti News