సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అడుగుపెడితే చాలు
సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఈ రోజున ఆయన క్షేత్రాల్లో అడుగుపెడితే చాలు అన్నట్టుగా భక్తులు భావిస్తుంటారు. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ... ఉపవాస దీక్షను చేపట్టి ... వల్లీ దేవసేన సమేతుడైన స్వామివారిని భక్తులు పూజిస్తూ వుంటారు.
స్వామివారి ఆలయానికి వెళ్లి అక్కడ ఆయనకి పూజాభిషేకాలు జరుపుతారు. సర్పరూపంలో గల సుబ్రహ్మణ్యస్వామికి ప్రదక్షిణలు చేసి పుట్టలో ఆవుపాలు పోస్తారు. పటిక బెల్లం ... అరటిపండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక స్వామివారు స్వయంభువుగా చెప్పబడే క్షేత్రాలకు ఈ రోజున భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది.
అలాంటి స్వయంభువు క్షేత్రాల్లో కృష్ణా జిల్లా 'మోపిదేవి' ... నెల్లూరు జిల్లా 'మల్లాం' ముందువరుసలో కనిపిస్తాయి. తారకాసుర సంహారం వలన కలిగిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి 'మల్లాం' లో సుబ్రహ్మణ్యస్వామి తపస్సు చేసుకున్నాడట. అలా ఆయన ఇక్కడ స్వంయభువుగా ఆవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది.
ఇక ఒకానొక దోష పరిహారార్థం స్వామి 'మోపిదేవి' లో తపస్సును ఆచరించి, అలాగే ఇక్కడ కొలువైనట్టు చెబుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ రెండు క్షేత్రాలలోను భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. మల్లాం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోయి వివాహ యోగం ... సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని చెబుతారు. ఈ స్వామికి ప్రదక్షిణలు చేయడం వలన వివిధ రకాల వ్యాధులు నివారించబడతాయని అంటారు.
ఇక మోపిదేవిలోని స్వామిని పూజించడం వలన చర్మసంబంధమైన వ్యాధులు తగ్గిపోతాయని చెబుతారు. సంతాన సౌభాగ్యాలతో పాటు విద్యా సంబంధమైన విషయాల్లోను అభివృద్ధి కలుగుతుందని అంటారు. ఈ రెండు క్షేత్రాల్లోను స్వామివారు వెలుగు చూసిన తీరు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. స్వామివారి లీలావిశేషాలను ఈ క్షేత్రాలు అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఉంటాయి. ఆయన పట్ల భక్తులకు గల విశ్వాసాన్ని మరింతగా పెంచుతుంటాయి.