ఇక్కడి స్థల మహాత్మ్యం అలాంటిది !

రాఘవేంద్రస్వామి సన్నిధిలో అడుగుపెట్టడమే అదృష్టం. ఆయన దర్శనభాగ్యమే జీవితానికో అర్థాన్నీ ... పరమార్థాన్ని ప్రసాదిస్తుంది. రాఘవేంద్రస్వామి జీవితమే మహిమల మాలికగా కనిపిస్తుంది. అలాంటి రాఘవేంద్రస్వామి అనునిత్యం మూలరాముడి సేవలో తరిస్తూ, అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఆధ్యాత్మిక వైభవానికి తనవంతు కృషిచేశాడు.

ఈ నేపథ్యంలో ఆయన ఒకసారి తన శిష్యులతో కలిసి ఆదోని నవాబును కలుసుకుంటాడు. ఆయన అభ్యర్థన మేరకు మంచాల గ్రామాన్ని కానుకగా ఇవ్వవలసినదిగా కోరతాడు. అంతకన్నా మంచి గ్రామాలను ఆయన ఇస్తానని చెప్పినా స్వామి సున్నితంగా తిరస్కరిస్తాడు. మంచాల గ్రామాన్నే అడగడానికి కారణమేవిటని శిష్యులు సందేహాన్ని వ్యక్తం చేస్తారు.

తాను ప్రహ్లాదుడిగా ఉన్నప్పుడు అక్కడ యజ్ఞయాగాదులు చేసినట్టుగా స్వామి చెబుతాడు. అందువలన ఆ ప్రదేశం అత్యంత పవిత్రమైనదని అంటాడు. అలాగే తన బృందావన నిర్మాణానికి తుంగభద్రా నదీతీరంలోని ఫలానా బండరాయిని తీసుకురమ్మని స్వామి చెబుతాడు. ఆయన ఆ బండరాయినే ఎందుకు తీసుకురమ్మంటున్నాడో తెలియక శిష్యులు అయోమయానికి లోనవుతారు.

రావణుడు సీతను అపహరించుకుని వెళ్లగా ఆమెను అన్వేషిస్తూ రామలక్ష్మణులు తుంగభద్రా నదీతీరానికి వచ్చారనీ, ఆ సమయంలో రాముడు ఆ బండరాయిపై సేదతీరాడని స్వామి చెబుతాడు. రాముడి పాదస్పర్శ కారణంగా ఆ బండరాయి ఎంతో పవిత్రతను సంతరించుకుందనీ, అందువలన దానినే తన బృందావన నిర్మాణానికి ఉపయోగించమని సెలవిస్తాడు.

ప్రహ్లాదుడి అవతారంలో ఈ ప్రదేశంతో గల అనుబంధం కారణంగా ... తన ఆరాధ్య దైవమైన రాముడు నడయాడిన ప్రదేశం కారణంగా రాఘవేంద్రస్వామి ఇక్కడ ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆయన కొలువైన ఈ ప్రదేశం మంత్రాలయమై ... మరింత మహిమాన్వితమై భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతోంది.


More Bhakti News