దోషాలను నివారించే ఆంజనేయుడు

హనుమంతుడిని పూజిస్తే దృష్టి దోషాలు తొలగిపోతాయి. గ్రహ సంబంధమైన దోషాలు దూరమవుతాయి. దుష్టప్రయోగాల వలన తలెత్తే సమస్యలు ... అనారోగ్యాలు నివారించబడతాయి. అందువల్లనే హనుమంతుడిని ఆరాధిస్తే అన్ని వరాలు దక్కుతాయని చెబుతుంటారు. హనుమంతుడు ఎంతటి శక్తిమంతుడో ... అంతటి వినయశీలి. ధీర గంభీరంగా కనిపించినా ... ప్రేమతో పిలిస్తేచాలు కరిగిపోయి కరుణిస్తాడు.

'రామ' అనే శబ్దం వినిపిస్తే చాలు అక్కడ వాలిపోతాడు. రామ భజన జరుగుతుంటే ఆనందంగా ఆ బృందంలో చేరిపోతాడు. తనని సేవించినా ... రాముడిని పూజించినా ఆయనపడే సంతోషం అంతా ఇంతా కాదు. అలాంటి భక్తులకు ఆయన అనుక్షణం రక్షణగా నిలుస్తుంటాడు. వారిచే పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. అలా ఆయన నిత్యనీరాజనాలు అందుకుంటోన్న క్షేత్రం 'అల్లిపురం' లో దర్శనమిస్తుంది.

ఖమ్మం జిల్లా కేంద్రానికి సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడి ప్రసన్నాంజనేయుడి ఆలయం ప్రాచీనతను ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ గ్రామానికి స్వామియే రక్షకుడని అంటారు. ఆయన కారణంగానే తాము ఆయురారోగ్యాలతో ... సుఖశాంతులతో ఉంటున్నట్టుగా చెబుతారు. ఈ కారణంగానే ఇక్కడి ప్రజలకు ఆయన ఇలవేల్పుగా కనిపిస్తుంటాడు.

ప్రతి మంగళవారం స్వామివారికి సిందూర అభిషేకాలు ... ఆకుపూజలు జరుగుతుంటాయి. స్వామివారికి ఇష్టమైన 'వడ' లను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. హనుమజ్జయంతితో పాటు ఇతర పర్వదినాల్లో స్వామివారిని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి స్వామిని పూజించడం వలన సమస్త దోషాలు నివారించబడి సకల శుభాలు చేకూరతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News