రక్షించే దేవుడే శిరిడీ సాయినాథుడు

శిరిడీ సాయినాథుడి వైద్యానికి తిరుగులేదు ... ఆయన ప్రసాదించే విభూతికి లొంగని వ్యాధిలేదని ఆయన భక్తులు విశ్వసిస్తుంటారు. సాయి మశీదులో వున్న కాలంలోనే ఆయన దగ్గరికి విభూతి కోసం వ్యాధిగ్రస్తులు వస్తుండేవారు. ఆయన చేతి ద్వార అందుకున్న విభూతి దివ్యమైన ఔషధంలా పనిచేసేది.

దాంతో విభూతికి ఉండవలసిన గుణాలతో పాటు దానికి ఆయన మహిమ కూడా తోడవుతుందని భక్తులు భావిస్తుండేవారు. సమాధిచెందిన తరువాత కూడా బాబా మహిమలు ఎలా పెరుగుతూ వచ్చాయో ... విభూతిపై భక్తులకు గల విశ్వాసం కూడా అలాగే పెరుగుతూ వచ్చింది. బాబాను స్మరిస్తూ ధరించే విభూతి ద్వారా వెంటనే ఉపశమనం లభిస్తుందని చెబుతుంటారు.

ఇక కొంతమంది భక్తులు దీర్ఘకాలికవ్యాధితో బాధపడుతూ ఉంటే సాయి స్వప్నదర్శనం ఇస్తూ ఉండేవాడు. స్వప్నంలోనే ఏదో తెలియని చికిత్సా విధానాన్ని ఆయన అనుసరించేవాడు. వ్యాధి గ్రస్తులకు స్వప్నంలో కాస్త బాధకలిగినట్టుగా అనిపించేది. మెలకువ వచ్చిన తరువాత వ్యాధి లక్షణాలు లేకపోవడం వాళ్లకి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉండేది. అలా వ్యాధుల బారి నుంచి బయటపడిన భక్తులు ఎంతోమంది కనిపిస్తుంటారు.

ఇక బాబాయే తమకి స్వయంగా శస్త్ర చికిత్స చేశాడని చెప్పే భక్తులు కూడా లేకపోలేదు. బాబా భక్తులు కొందరు శస్త్రచికిత్స చేయించుకోవడానికి సిద్ధపడగా, స్వప్నంలో బాబా వైద్యుడిగా వచ్చి శస్త్రచికిత్స చేసినట్టుగా వాళ్లకి అనిపించేదట. అంతకుముందు శస్త్రచికిత్స అవసరమని చెప్పిన వైద్యులే ఆ తరువాత శస్త్రచికిత్స అవసరంలేదని చెప్పడమే ఇందుకు నిదర్శనం.

ఇలా తనని విశ్వసిస్తోన్న భక్తులను రక్షించడం కోసం బాబా అన్ని మార్గాలలోనూ ప్రయత్నాలు చేస్తుంటాడు. భక్తుల బాధలను తాను స్వీకరిస్తూ వాళ్ల సంతోషాన్ని చూస్తూ సంతృప్తిని పొందుతుంటాడు. ఈ కారణంగానే ప్రతి మనసు ఆయన మందిరమైంది ... భక్తులను ఆదుకున్నతీరు అపూర్వమైన లీలా విశేషమైంది.


More Bhakti News