ఈ పూలతో శివుడిని పూజించాలి
పరమశివుడు అల్పసంతోషి ... దోసెడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు సముద్రమంత సంతోషపడతాడు. అడవిపూలతో పూజించినా ఆనందంతో పొంగిపోతాడు. ఆపదలో ఉంటే అమ్మలా పరిగెత్తుకు వస్తాడు. ఆందోళన చెందుతూ ఉంటే తండ్రిలా రక్షణగా నిలుస్తాడు. అందుకే అందరూ ఆదిదేవుడిని ఎంతగానో ఇష్టపడుతుంటారు. భక్తిశ్రద్ధలతో ఆ స్వామిని ఆరాధిస్తూ ఉంటారు.
అనునిత్యం ఆ స్వామిని పూజించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. సాధారణంగా స్వామివారి పూజకుగాను వివిధ రకాల పూలను ఉపయోగిస్తుండటం జరుగుతుంది. వీటిలో గన్నేరులు ... ఉమ్మెత్తలు ... జిల్లేడు ... పొగడలు ... మందారాలు మొదలైనవి ఆదిదేవుడికి అత్యంత ప్రీతికరమైనవి. ఒక్కోరకం పూలతో శివుడిని పూజించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం కలుగుతుంది.
ఈ నేపథ్యంలో 'పొగడపూలు' కూడా ఎంతో విశేషమైనవిగా చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా 'మార్గశిర మాసం'లో శివుడిని అర్చించడానికి 'పొగడపూలు' మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి. ఈ మాసంలో పొగడపూలతో శివుడిని పూజించడం వలన సంతోషంతో సంతృప్తిని పొందిన శివుడు, ఇహంలోను ... పరంలోను సుఖశాంతులను ప్రసాదిస్తాడు. అందువలన మార్గశిర మాసంలో మహాదేవుడి మనసును పొగడపూలతో గెలుచుకోవాలనే విషయాన్ని మరిచిపోకూడదు.