ఇది రాధాదేవి శాప ఫలితమేనట !
కొన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్లినప్పుడు అక్కడ కాకులు కనిపించవు. పూర్వం అక్కడ తపస్సు చేసుకుంటోన్న మహర్షుల ఏకాగ్రతకు అవి భంగం కలిగించాయనీ, ఆ ప్రదేశంలో వాటికి ప్రవేశం లేకుండా వాళ్లు శపించిన కారణంగానే అక్కడికి కాకులు రావని చెబుతుంటారు.
అలానే వేగంగా ప్రవహించే కొన్ని నదులు కొన్ని క్షేత్రాల దగ్గర తమ వేగాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా ముందుకు సాగుతుంటాయి. ఒకప్పుడు ఇక్కడ తపస్సు చేసుకునే మహర్షులు, గలగలమనే శబ్దంతో తమ తపస్సుకి భంగం కలిగించకూడదని ఆదేశించడం వల్లనే అవి ప్రశాంతంగా ప్రవహిస్తున్నాయని అంటారు.
అలాగే బృందావనంలోని యమునానది తీరంలో గల చింతచెట్లకు కాయలు కాయవని చెబుతుంటారు. అందుకు రాధాదేవి శాపమే కారణమనే కథనం మనకి ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఒకసారి రాధాదేవి ... ఇక్కడి చింతచెట్టు క్రింద కూర్చుని శ్రీకృష్ణుడి గురించిన ఆలోచనలతో మునిగి తేలుతుండగా, ఒక చింతకాయ వేగంగా వచ్చి ఆమెకి తగిలిందట.
దాంతో ఉలిక్కిపడి ఆమె ఈ లోకంలోకి వస్తుంది. ఊహాలోకంలో కృష్ణుడితో కలిసి ఆడిపాడుతోన్న ఆమె, అంతరాయం కారణంగా ఆగ్రహావేశాలకి లోనవుతుంది. ఇకపై ఇక్కడి చింతచెట్లకి కాయలు కాయకూడదంటూ శపించిందట. అందువల్లనే ఇక్కడి చింతచెట్లకు కాయలు కాయవని చెబుతుంటారు. ఈ ప్రాంతమంతా రాధాకృష్ణుల పాదస్పర్శచే పవిత్రమైంది కాబట్టి, వాళ్ల ఆటపాటలను కనులముందు ఆవిష్కరించుకుంటూ ఈ చెట్లను చూస్తే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.