దివి నుంచి దిగివచ్చిన దేవుడు !

భగవంతుడిని అంకితభావంతో సేవిస్తే చాలు ఆ భక్తులకు సేవలు చేయడానికి ఆయన వెనుకాడడనే విషయాన్ని ఎన్నో సంఘటనలు నిరూపిస్తూ వచ్చాయి. ఆయన పట్ల అపారమైన విశ్వాసముంటే చాలు ఆయన తోడుగా ఉన్నట్టేననే విషయాన్ని స్పష్టం చేశాయి.

ఒకసారి రాత్రి సమయంలో 'పురందర దాసు' కి దాహం వేసి తన శిష్యులను పిలుస్తాడు. ఎవరూ పలక్కపోవడంతో తీవ్రమైన అసహనానికి లోనవుతాడు. అప్పుడు ఆయన శిష్యుడి రూపంలో పాండురంగడే మంచినీళ్లు తీసుకొచ్చి ఆయన దాహం తీరుస్తాడు. ఆ సమయంలోనే పురందరదాసుచే చెంపదెబ్బ కూడా తింటాడు.

అలాగే 'గోరా కుంభార్' స్వామికిచ్చిన మాట కోసం తన రెండు చేతులు నరికేసుకుంటాడు. ఆయన కుటుంబం గడవడం కోసం స్వామి ఆ ఇంట్లో పనివాడిగా చేరతాడు. కుండలు తయారుచేసి ఆ కుటుంబ పోషణ చేస్తాడు. ఇక 'ఏకనాథుడు' విషయం లోను స్వామి ఇలానే చేశాడు.

భాగవతాన్ని మరాఠీలోకి అనువదించడంలో నిమగ్నమైన ఏకనాథుడు ఆకలి దప్పులను కూడా పట్టించుకోడు. అది గమనించిన పాండురంగడు, ఆయన తలపెట్టిన కార్యక్రమం పూర్తయ్యేంతవరకూ ఆ ఇంట్లో వంటవాడిగా ఉంటాడు. ఇక పండరీపురం చూడటానికి సక్కుబాయి పడుతున్న ఆరాటం స్వామిని కదిలిస్తుంది.

భర్త రూపంలో ఆమెని పండరీపురం పంపించిన స్వామి, ఆమె రూపంలో అ ఇంట్లోని పనులు చేస్తాడు. ఇలా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భగవంతుడే సేవలు చేసిన తీరు చూస్తే, ఆ దేవదేవుడు ఎంతటి చల్లని మనసున్నవాడో తెలుస్తుంది. ఆయన పవిత్రమైన పాదాల చెంత జీవితాన్ని సమర్పించాలనిపిస్తుంది.


More Bhakti News