పంచముఖ హనుమ ఆరాధనా ఫలితం !
సాధారణంగా హనుమంతుడు తనకి గల వివిధ శక్తుల కారణంగా అనేక నామాలతో కొలవబడుతూ ఉంటాడు. వీరాంజనేయుడు ... భక్తాంజనేయుడు ... దాసాంజనేయుడు ఇలా వివిధ నామాలతో దర్శనమిస్తూ ఉంటాడు. ఒక్కోముద్రలో ... ఒక్కో నామంతో కనిపించే హనుమంతుడు ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
హనుమంతుడు ఎలా పిలవబడినా ఆయనపట్ల భక్తులకు గల విశ్వాసం అపారం. అనేక రకాల కష్ట నష్టాలకు ఆయన అనుగ్రహమే పరిష్కారమని భావిస్తుంటారు. ఈ కారణంగానే హనుమంతుడు ఎక్కడ కొలువుదీరినా ఆయన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి.
హనుమంతుడిని ఆరాధిస్తే దుష్ట ప్రయోగాల నుంచి ... గ్రహ బాధల నుంచి ... అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని అంటారు. ఈ నేపథ్యంలో కొన్ని క్షేత్రాల్లో పంచముఖ హనుమంతుడు కూడా దర్శనమిస్తూ ఉంటాడు. ఈ రూపంలో హనుమంతుడితో పాటు గరుత్మంతుడు ... నరసింహస్వామి ... వరాహస్వామి ... హయగ్రీవస్వామి దర్శనమిస్తూ ఉంటారు. హనుమంతుడికి గల అనంతమైన శక్తికి నిదర్శనంగా ఈ రూపం చెప్పబడుతోంది.
పంచముఖ హనుమంతుడిని దర్శించడం వలన ... అంకితభావంతో ఆరాధించడం వలన విజయాలు చేకూరతాయని చెప్పబడుతోంది. ధర్మబద్ధమైన ... శుభప్రదమైన కార్యాలను తలపెడుతున్నప్పుడు స్వామివారిని తప్పనిసరిగా పూజించాలి. ఈ విధంగా చేయడం వలన ఆరంభించే కార్యాలకు ఆయన అనుమతి ... ఆశీస్సులు లభించినట్టు అవుతుంది.
తనపట్ల గల విశ్వాసంతో ఆరంభించిన పనులు మధ్యలో నిలిచిపోకుండా ఆయనే చూసుకుంటాడు. అందువలన తలపెట్టిన కార్యాల్లో ఆశించిన విజయాలు తప్పకుండా లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది. విజయమే ఉత్సాహాన్నీ ... సంతోషాన్నీ ... సంపదలను ... కీర్తి ప్రతిష్ఠలను ఇస్తుంది. అలాంటి విజయాన్ని సాధించాలనుకునే వాళ్లంతా పంచముఖ హనుమంతుడిని సేవించడం మరచిపోకూడదు.