అడవిలోని గుహలో అమ్మవారు !
దైవలీలను అర్థంచేసుకోవడం మానవమాత్రులకు అసాధ్యమేననే విషయాన్ని అందరూ అంగీకరిస్తుంటారు. దైవం ఎక్కడ ఆవిర్భవించినా ఆ దైవాన్ని దర్శించడానికి ఎంత కష్టమైనా భక్తులు ఇష్టంగా భరిస్తుంటారు. అడవుల్లో ... కొండల్లో ... గుహల్లో వెలసిన దైవాలను దర్శించుకుని సంతోషాన్నీ .. సంతృప్తిని పొందుతుంటారు.
అలాంటి ఆనందాన్ని కలిగించే అమ్మవారి క్షేత్రం ఒకటి 'బుట్టాయిగూడెం' సమీపంలో కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో గల బుట్టాయిగూడెం నుంచి దాదాపు ముఫ్ఫై కిలోమీటర్ల దూరం అడవీమార్గంలో ప్రయాణించిన తరువాత అమ్మవారు కొలువైన గుహ కనిపిస్తుంది.
ఈ అమ్మవారిని 'గుబ్బల మంగమ్మ తల్లి' గా భక్తులు కొలుస్తుంటారు. కొండజాతికి చెందిన ప్రజలు 'అడవితల్లి' గా ఆరాధిస్తూ ఉంటారు. గుహ పైభాగం నుంచి నిరంతరం నీరు పడుతూ ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఎవరికీ తెలియదు. మోకాళ్ల లోతు నీళ్లలో నడుస్తూ వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోవలసి ఉంటుంది.
దగ్గరి నుంచి చూస్తే అమ్మవారు సర్ప లక్షణాలను కలిగినట్టుగా అనిపిస్తుంది. ఈ సందేహానికి తగినట్టుగానే ఒక సర్పం అమ్మవారి పరిసరాల్లోనే తిరుగుతూ ఉంటుందని చెబుతుంటారు. అమ్మవారు స్వయంభువు కావడం వలన, ఆ తల్లి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై వుందని భక్తులు విశ్వసిస్తుంటారు. అమ్మవారిని ఆప్యాయంగా సేవిస్తే అడిగిన వరాలను ప్రసాదిస్తుందని చెబుతుంటారు.
ముఖ్యంగా సంతాన సౌభాగ్యాలను ... విజయాలను అందిస్తుందని అంటారు. ప్రతి మంగళవారం ... ఆదివారం అమ్మవారిని దర్శించుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో ఇక్కడి వాతావరణం ఒక పెద్ద జాతరను తలపిస్తూ ఉంటుంది. అటు ఖమ్మం జిల్లా నుంచి ఇటు ఉభయగోదావరి జిల్లాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు.
అడవీ ప్రాంతంలో ప్రయాణం ... అమ్మవారు గుహలో స్వయంభువుగా ఉండటం ... సర్పం అమ్మవారిని కనిపెట్టుకుని ఉండటం ... గుహలోకి నీరు నిరంతరం వస్తూ ఉండటం ... వీటికి తోడు అమ్మవారు చూపే మహిమల కారణంగా ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా చెబుతుంటారు. ఆ తల్లి ఆశీస్సులు అందుకుని ఆనందంతో తిరిగి వెళుతుంటారు.