ఆపదలను తొలగించే అమ్మవారు
ప్రార్ధించినంతనే పరమశివుడు కరిగిపోయి కరుణిస్తూ ఉంటాడు. తన భక్తులు బాధపడకూడదనే ఉద్దేశంతో అడిగిన వరాలను ఇచ్చేస్తుంటాడు. ఇక అమ్మవారు కూడా భక్తులను తన బిడ్డలుగా భావిస్తూ వాళ్లు విన్నవించిన కోరికలను నెరవేరుస్తూ ఉంటుంది. సంతాన సౌభాగ్యాలను ... సంపదలను ప్రసాదిస్తూ ఉంటుంది. ఈ కారణంగానే అమ్మవారి ఆలయాలు భక్తులతో నిత్యం రద్దీగా కనిపిస్తూ ఉంటాయి.
స్త్రీలు సంతాన సౌభాగ్యాలను ప్రాణంగా భావిస్తుంటారు. తమ సంతానాన్నీ ... సౌభాగ్యాన్ని చల్లగా చూడమని అమ్మవారిని వేడుకుంటూ వుంటారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజచేస్తూ ... పర్వదినాల్లో ఆ తల్లికి చీరసారెలు సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారికి గోరంత సేవ చేసుకుంటే ఆమె కొండంత ఫలితాన్ని ఇస్తుందని అంటారు. ఆమె అనుగ్రహాన్ని పొందడానికిగాను వ్రతాలను ఆచరిస్తూ ఉపవాసాలు చేస్తుంటారు.
అమ్మా .. అని ఆర్తితో పిలిస్తేచాలు ఆ తల్లి పలుకుతుంది. తన బిడ్డల అవసరాలు తెలుసుకుని వాటిని సమకూరుస్తుంది. అయితే అమ్మవారికి 'అష్టమి' తిథి అంటే ఇష్టం కనుక ఆ రోజున ఆ తల్లిని పూజించడం వలన కలిగే ఫలితం మరింత విశేషంగా ఉంటుందని చెప్పబడుతోంది. అమ్మవారు అవతరించినది అష్టమి రోజునే కనుక ఈ రోజు ఆమెకి ఎంతో ప్రీతికరమైనది.
అలాంటి ఈ రోజున అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించి, ఆమెకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం వలన ఎంతగానో సంతృప్తి చెందుతుందని అంటారు. ఈ రోజున అమ్మవారిని సేవించడం వలన పాపాలు .. దోషాలు .. ఆపదలు తొలగిపోతాయని చెప్పబడుతోంది. ఆయురారోగ్య ఐశ్వర్యాలు ... సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని స్పష్టం చేయబడుతోంది.