అండదండగా నిలిచే ఆంజనేయుడు

సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రామావతారాన్ని ధరించాడు. సీతను రావణుడు అపహరించినప్పుడు, ఆమెను వెతుకుతూ రామలక్ష్మణులు బయలుదేరుతారు. ఆ సమయంలోనే వాళ్లకి హనుమంతుడు పరిచయమవుతాడు. రాముడి ఆవేదనను అర్థం చేసుకున్న హనుమంతుడు, ఆయన సన్నిధికి సీతమ్మవారు చేరేంతవరకూ విశ్రమించలేదు.

అలాగే సాధారణ మానవులు కష్టాల్లో ... సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్లను ఆదుకోవడంలోను హనుమంతుడు ముందేవుంటాడు. ఈ కారణంగానే హనుమంతుడి ఆలయాలు గ్రామగ్రామాన దర్శనమిస్తూ ఉంటాయి. అలాంటి గ్రామాల్లో ఒకటిగా 'పరెడ్డిగూడెం' కనిపిస్తుంది. నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలంలో ఈ ఆలయం అలరారుతోంది.

మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రానికి ప్రతి మంగళవారం విశేషమైన సంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామివారికి సిందూర అభిషేకాలు ... ఆకుపూజలు చేయిస్తుంటారు. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్లంతా ఇక్కడి హనుమంతుడిని తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తూ ఉంటారు. స్వామి అనుగ్రహం కారణంగానే ఇక్కడి పాడిపంటలు వృద్ధి చెందుతున్నాయని విశ్వసిస్తుంటారు.

హనుమంతుడిని అంకితభావంతో పూజించడం వలన, ఆయన అండదండగా నిలిచి కాపాడుతూ ఉంటాడని అంటారు. ఈ స్వామి అనుగ్రహంతో ఎంతోమంది అనారోగ్య సమస్యల నుంచి ... ఆర్ధికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడ్డారని చెబుతుంటారు. స్వామివారు స్వప్నదర్శనం ఇచ్చిన అనుభవం ఇక్కడ ఎంతోమంది భక్తులకు ఉంది. హనుమజ్జయంతి రోజున ... పర్వదినాల్లోను ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు ఇక్కడ జరుపుతుంటారు. ఈ సందర్భంగా హనుమంతుడి ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుని మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు.


More Bhakti News