ఆకట్టుకునే ఆదిదేవుడి లీలావిశేషం !
నలదమయంతుల పేరు వినగానే వాళ్లిద్దరినీ ఒక్కటి చేసిన 'హంస రాయబారం' గుర్తుకు వస్తుంది. నలదమయంతుల వివాహానికి దారితీసిన పరిస్థితులు కనులముందు కదలాడతాయి. విదర్భ రాజైనటువంటి భీముడి కుమార్తె 'దమయంతి' సౌందర్యవతి. ఇక నిషధ రాజు నలుడు మహా పరాక్రమవంతుడు. ఒక హంస వాళ్లిద్దరి మధ్య రాయబారం నడుపుతుంది.
నల మహారాజు గుణగణాలను గురించి దమయంతితోను ... ఆమె సౌందర్య విశేషాలను గురించి నలుడితోను హంస చెబుతుంటుంది. ఒకరిపట్ల ఒకరికి ఆసక్తినీ ... అనురాగాన్ని కలిగించి వారి వివాహానికి కారణమవుతుంది. అయితే ఆ ఇద్దరినీ ఒక్కటిగా చేసేందుకు పరమశివుడే హంసగా మారాడనే కథనం కూడా వినిపిస్తూ ఉంటుంది.
పూర్వం ఒక కొండ ప్రాంతంలో భిల్ల జాతికి చెందిన ఆలుమగలు ఉండేవారు. తమకి తెలిసిన విధంగా వాళ్లు శివుడిని ఆరాధిస్తూ ఒక చిన్న గుహలో నివసిస్తూ ఉండేవాళ్లు. ఒకసారి ఆ దంపతుల భక్తిని పరీక్షించడానికి మారువేషంలో శివుడు వాళ్ల గుహకి వెళతాడు. తనకి ఆశ్రయం ఇవ్వవలసినదిగా ఆమె భర్తను కోరతాడు. శివుడికి ఆశ్రయమిచ్చి బయట సేదతీరిన కారణంగా అతను జంతువుల బారినపడి ప్రాణాలను కోల్పోతాడు. దాంతో ఎంతమాత్రం ఆలోచించకుండా ఆమె కూడా ప్రాణత్యాగానికి సిద్ధపడుతుంది.
తన కారణంగా విడిపోయిన ఆ దంపతులను అనుగ్రహించిన స్వామి, వచ్చే జన్మలోను వాళ్లని ఒక్కటిగా చేయాలని నిర్ణయించుకుంటాడు. వచ్చే జన్మలో వాళ్లని తానే కలపాలనీ, అందుకుగాను తాను హంసరూపం ధరించాలని అనుకుంటాడు. ఆ దంపతులే తరువాత జన్మలో నలదమయంతులుగా పుట్టారనీ, అనుకున్న ప్రకారం హంస రూపాన్ని ధరించిన పరమశివుడు ఆ ఇద్దరినీ కలిపాడనే ఒక ఇతివృత్తం ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది. నలదమయంతుల కథనం కూడా సదాశివుడి లీలావిశేషాల్లో ఒక భాగంగా అనిపిస్తుంది.