కాలభైరవుడి ఆరాధనతో కలిగే ఫలితం !

అహంభావంతో తనని అవమానపరచిన దక్షుడిని సంహరించడం కోసం పరమశివుడు తన జట పాయను తీసి విసరగా దానిని నుంచి 'వీరభద్రుడు' ఉద్భవిస్తాడు. ఆదిదేవుడి ఆదేశం మేరకు దక్షుడి తలను ఖండిస్తాడు. అలాగే బ్రహ్మదేవుడు అహంకారంతో వ్యవహరించడం వలన, సహనం కోల్పోయిన శివుడు ఆవేశంతో హూంకరిస్తాడు. ఆ హూంకారంలో నుంచి కాలభైరవుడు పుడతాడు. బ్రహ్మదేవుడు ఏ తలతోనైతే అహంభావంతో మాట్లాడాడో ఆ తలను సదాశివుడి ఆదేశానుసారం ఖండిస్తాడు.

అలా కాలభైరవుడు అవతరించినది 'మార్గశిర శుద్ధ అష్టమి'గా చెప్పబడుతోంది. ఈ రోజునే 'కాలభైరవాష్టమి' అని పిలుస్తుంటారు. బ్రహ్మదేవుడి తలను ఖండించిన పాపం నుంచి బయటపడాలని కాలభైరవుడు అనుకుంటాడు. పరమశివుడి ఆదేశానుసారం అనేక క్షేత్రాలను దర్శిస్తూ చివరగా 'కాశీ' నగరానికి చేరుకుంటాడు. ఆ ప్రదేశంలో అడుగుపెట్టగానే ఆయన పాపం పటాపంచలవుతుంది. బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడిన కాలభైరవుడు అక్కడ క్షేత్రపాలకుడిగా ఉండిపోతాడు.

ఒక్క కాశీ క్షేత్రంలోనే కాదు .. ఎన్నో శైవక్షేత్రాల్లో ఆయన క్షేత్రపాలకుడిగా దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి కాలభైరవుడి పేరు వినిపించినా ... ఆయన రూపం కనిపించినా ఎంతటివారికైనా కాస్తంత గుండె దడగానే ఉంటుంది. అందుకు కారణం ఆయన వీరభద్రుడులానే ఉగ్రమూర్తిగా కనిపిస్తుంటాడు. అలాగే వీరభద్రుడిలా చల్లని మనసున్నవాడిగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు.

అలాంటి కాలభైరవుడిని కాలభైరవాష్టమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. కాలభైరవుడి అనుగ్రహాన్ని పొందడం వలన సమస్త పాపాలు ... గ్రహ సంబంధమైన దోషాలు ... వాటి కారణంగా కలిగే వ్యాధులు ... దుష్టశక్తులు కలిగించే ఇబ్బందులు దూరమైపోతాయని చెప్పబడుతోంది. కాలభైరవుడి ఆలయాలు తక్కువగా ఉంటాయి కనుక, ఈ రోజున ఆయన నామాన్ని స్మరిస్తూ శివాలయాన్ని దర్శించినా అదే ఫలితం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.


More Bhakti News