సుబ్రహ్మణ్యుడు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడట !

సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన సర్పసంబంధమైన దోషాలు నశించి సకల శుభాలు చేకూరతాయి. అందువలన ఆయన ఆలయాలను దర్శించి పూజాభిషేకాలు జరిపించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో స్వయంభువు సుబ్రహ్మణ్యస్వామి కొలువైన క్షేత్రాలు మరింత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి.

అలాంటి క్షేత్రాల జాబితాలో 'అత్తిలి' ఒకటిగా కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో భక్తుల కొంగుబంగారమై ఈ క్షేత్రం విలసిల్లుతోంది. పూర్వం 'అత్రి మహర్షి' ఆశ్రమాన్ని ఏర్పాటుచేసుకున్న కారణంగా ఈ ప్రదేశం అత్రి గ్రామంగా పిలవబడిందనీ, కాలక్రమంలో అది అత్తిలిగా మారిందని చెబుతారు.

సుబ్రహ్మణ్యస్వామి ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఏకశిలపై వల్లీ - దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్యస్వామి ఆవిర్భవించడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతగా చెబుతుంటారు. స్వామి ఇక్కడ సర్పరూపంలో తిరుగుతూ ఉంటాడనీ, అందుకు అనేక నిదర్శనాలు ఉన్నాయని చెబుతుంటారు.

ఇక్కడి స్వామిని ఆరాధించడం వలన వివాహయోగం కలుగుతుందనీ, సంతాన సౌభాగ్యాలు నిలుస్తాయని అంటారు. అత్రి మహర్షి - అనసూయ మాత పాదస్పర్శ కారణంగా ... వల్లీ - దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యస్వామి స్వయంభువు కావడం వలన సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ క్షేత్రాన్ని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఆ స్వామిని అంకితభావంతో సేవించి తరిస్తుంటారు.


More Bhakti News