ఆదుకునేవారిని ఆదుకునే దేవుడు !

ఇతరులకు సాయం చేసేవారికి ఆ భగవంతుడు సాయం చేస్తుంటాడు. నిస్సహాయులకు అండగా నిలిచేవారికి ఆ దేవుడు అండగా నిలుస్తుంటాడు ... ఆపదల నుంచి కాపాడుతుంటాడు. ఇదే విషయం ఛత్రపతి శివాజీ విషయంలోనూ స్పష్టమవుతూ ఉంటుంది.

ఒకసారి తుకారామ్ విషయంలో శివాజీకి ఒక ఫిర్యాదు అందుతుంది. పాండురంగస్వామి విగ్రహం ఆలయం నుంచి మాయమైందనీ, అందుకు కారకుడు తుకారామ్ అనేది ఆ ఫిర్యాదు సారాంశం. అప్పటికే తుకారామ్ గురించి విని ఉన్న శివాజీ, ఈ విషయంలో తాను స్వయంగా కలగజేసుకోకపోతే ఒక మహాభక్తుడిని బాధించినట్టు అవుతుందని భావిస్తాడు.

అజ్ఞానంతో ఆయన విలువ తెలుసుకోలేకపోతోన్న కొంతమందికి ఆయన గొప్పతనాన్ని తెలియజెప్పాలని శివాజీ అనుకుంటాడు. తన పరివారంతో కలిసి ఆ గ్రామానికి చేరుకుంటాడు. జరిగిన సంఘటనలో తుకారామ్ పాత్రలేదనే విషయాన్ని ఆయనే నిరూపించుకోవాలని అంటాడు. మహాభక్తుడైన తుకారామ్ ని అభిమానించే వాళ్లకి ఆయన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

తనపై పడిన నింద నిజం కాదని నిరూపించమని ఆ స్వామికి తుకారామ్ మొరపెట్టుకుంటాడు. కొంతమంది దుష్టబుద్ధులు కాజేసిన ఆ విగ్రహం, అంతా చూస్తుండగానే ఆలయానికి తిరిగి వస్తుంది. అలా తుకారామ్ నిర్దోషత్వం బయటపడుతుంది. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసినవాళ్ల కళ్లు తెరుచుకుంటాయి. తన ప్రయత్నం ఫలించినందుకు శివాజీ మహారాజు సంతోషిస్తాడు. అలాంటి మహాభక్తుడితో కలిసి జీవనాన్ని కొనసాగిస్తోన్న ఆ గ్రామస్తులు అదృష్టవంతులని చెబుతాడు.

అదే సమయంలో శత్రుసేనలు శివాజీని బంధించడానికి ప్రయత్నిస్తాయి. అయితే పాండురంగస్వామి ఆ సేనలను ఆ గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటాడు. శత్రుసేనల చేతికి శివాజీ చిక్కకుండా చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న శివాజీ కూడా ఆనందాశ్చర్యాలకి లోనవుతాడు. తాను తుకారామ్ ని కాపాడటానికి వచ్చిన కారణంగానే, ఆ భగవంతుడు తనని రక్షించాడని విశ్వసించిన ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. ఇతరులకు సాయపడేవాళ్లకి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందనీ, ఆయన సాయం తప్పనిసరిగా అందుతుందని చెప్పడానికి ఈ సంఘటన నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది.


More Bhakti News