సుబ్రహ్మణ్యస్వామి పూజా ఫలితం !

సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాలు అత్యంత విశిష్టమైనవిగా అలరారుతున్నాయి. ఆయన కొలువైన ఆయా క్షేత్రాలు భక్తులకు అనుభూతినీ ... మహిమలతో కూడిన అనుభవాన్ని అందిస్తూ ఉంటాయి. మానసికపరమైన ప్రశాంతతను ప్రసాదించేవిగా, అనేక దోషాలను నివారించేవిగా ఈ క్షేత్రాలు అలరారుతున్నాయి.

మంగళవారాల్లోనూ ... పర్వదినాల్లోను స్వామివారిని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ... ఘనంగా సేవలు జరుగుతుంటాయి. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన, శివపార్వతుల అనుగ్రహంతో పాటు లక్ష్మీనారాయణుల కరుణాకటాక్షాలు లభిస్తాయని చెప్పబడుతోంది.

తల్లిదండ్రులుగా సుబ్రహ్మణ్యస్వామి పట్ల శివపార్వతులు చూపిన ప్రేమానురాగాలు సాటిలేనివిగా లోకంలో నిలిచిపోయాయి. అందువలన సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన వాళ్ల ప్రీతికి పాత్రులు కావడం జరుగుతుంది. ఇక ఆదిపరాశక్తి అయిన అమ్మవారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి సోదరిగా పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన విష్ణుమూర్తికి సుబ్రహ్మణ్యస్వామి మేనల్లుడు అవుతాడు.

సుబ్రహ్మణ్యస్వామి వివాహమాడిన శ్రీవల్లీ దేవసేనలు ఇద్దరూ కూడా లక్ష్మీనారాయణుల కుమార్తెలనే ప్రస్తావన కొన్ని ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది. శ్రీమహావిష్ణువుతో సుబ్రహ్మణ్యస్వామికి ఇంతటి అనుబంధం ఉన్న కారణంగానే, ఆయనని ఆరాధిస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పబడుతోంది. ఈ కారణంగానే సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన శివపార్వతులను ... లక్ష్మీనారాయణులను పూజించిన ఫలితం దక్కుతుందని అంటారు. ఇంతటి విశేషాన్ని కలిగిన సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆ స్వామిని ఆరాధించే అవకాశం లభించడం అపురూపమైన వరంగా భావించాలి.


More Bhakti News