పాలరాయి గణపతి ఆరాధనా ఫలితం !
ఏ దేవాలయానికి వెళ్లినా అక్కడ వినాయకుడు తప్పక దర్శనమిస్తూ ఉంటాడు. ఏ దైవకార్యమైనా ఆయనే తొలిపూజను అందుకుంటూ ఉంటాడు. ఏ శుభకార్యమైనా ఆయనని ఆహ్వానించకుండా ... ఆరాధించకుండా ఆరంభం కాదు. తలపెట్టిన కార్యాన్ని చెప్పుకుని స్వామి సహకారాన్ని కోరితే చాలు, ఆ కార్యానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆయనే చూసుకుంటాడు. ఆ పని పూర్తయ్యేంత వరకూ అండదండగా నిలుస్తాడు.
ఈ కారణంగానే పిల్లల నుంచి పెద్దలవరకూ అంతా వినాయకుడిని ఎంతో ఇష్టంతో పూజిస్తుంటారు ... సంతోషంగా సేవిస్తుంటారు. చాలామంది పూజామందిరాల్లో వివిధ రకాల వినాయకుడి ప్రతిమలు కనిపిస్తూ ఉంటాయి. మట్టితోను .. రాతితోను మలచబడిన వినాయకుడిని పూజించడం, వెండి బంగారు లోహాలతో చేయించిన వినాయకుడిని ఆరాధించడం ప్రాచీనకాలం నుంచి ఉంది.
వీటిలో ఒక్కో వినాయక ప్రతిమను పూజించడం వలన ఒక్కో ఫలితం లభిస్తుందని చెప్పబడుతోంది. ఈ నేపథ్యంలో పాలరాతి గణపతి ప్రతిమలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పాలరాతితో చేయబడిన మూర్తి ఎంతో అందంగా కనిపిస్తూ మనసును ఆకట్టుకుంటుంది. పాలరాయి గణపతిని పూజించడం వలన, చంద్ర గ్రహసంబంధమైన దోషాలు తొలగిపోవడమే కాకుండా, మానసికపరమైన ప్రశాంతత లభిస్తుంది.
మానసికపరమైన ప్రశాంతత లేకపోవడమే అనేక అనారోగ్యాలకు కారణమవుతూ ఉంటుంది. అనారోగ్యమనేది ఆనందాన్ని హరించి వేస్తూ ఆవేదనకి చేరువచేస్తూ ఉంటుంది. అందువలన జీవితం సంతోషంగా సాగిపోవాలంటే మానసికపరమైన ప్రశాంతత అవసరమనే విషయాన్ని మరిచిపోకూడదు. అలాంటి మానసిక ప్రశాంతత కోసం పాలరాయితో చేయబడిన వినాయకుడిని అనునిత్యం పూజిస్తూ ఉండాలి. ఆ స్వామి అనుగ్రహాన్ని అందుకుంటూ ఉండాలి.