శివుడు ఇక్కడ నందిని నిలిపాడట !
మార్గశిర మాసంలో ఉదయాన్నే ఏ దేవాలయంలో చూసినా అయ్యప్పస్వామి భక్తులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయ్యప్పస్వామి దీక్ష ధారణ చేసిన భక్తులు బృందాలుగా ఏర్పడి, ఆ స్వామి భజనలతో సందడి చేస్తుంటారు. నియమ నిష్టలను పాటిస్తూ దీక్షాకాలాన్ని పూర్తిచేసిన భక్తులు, శబరిమల వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు.
స్వామి సన్నిధానానికి చేరుకోవడానికి భక్తులు అడవీమార్గంలో పద్ధెనిమిది కొండలను దాటుకుని వెళ్లవలసి ఉంటుంది. ఈ కొండ ప్రదేశాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తూ ఉంటాయి. ఈ పద్ధెనిమిది కొండ ప్రదేశాల్లో ఒకటిగా 'కాళ్తే కట్టి' చెప్పబడుతోంది. పరమశివుడు తన వాహనమైన 'నంది'ని నిలపడం వలన ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని చెబుతారు.
మహిషాసురుడి సోదరి అయిన మహిషి, అసురసేనతో దేవతలపై దండెత్తుతుంది. కారణజన్ముడైన మణికంఠుడి చేతిలో ఆమె సంహారం రాసి పెట్టి ఉందని తెలిసిన దేవతలు ఆయనని ఆశ్రయిస్తారు. లోక కల్యాణం కోసం మహిషిని అంతం చేయవలసిందిగా కోరతారు. వాళ్ల అభ్యర్థన మేరకు మణికంఠుడు మహిషితో తలపడతాడు. ఆయన శక్తి సామర్థ్యాల ముందు నిలువలేనని గ్రహించిన మహిషి, పంతం కొద్దీ ఆయనతో పోరాడుతూ ఉంటుంది.
ఆ దృశ్యాన్ని చూడటానికి సమస్త దేవతలు ఆ ప్రదేశానికి చేరుకుంటారు. అలాగే పరమశివుడు కూడా తన నంది వాహనంపై వస్తాడు. మహిషిని మణికంఠుడు సంహరించే తీరును చూడానికి వెళుతూ ఆయన తన నంది వాహనాన్ని ఇక్కడ నిలుపుతాడు. ఈ కారణంగానే ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని చెబుతారు. శరణాలు చెప్పుకుంటూ ఈ ప్రదేశానికి చేరుకున్న అయ్యప్ప భక్తులు అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతుంటారు. అలాంటి అనుభూతులు అందించే ఆనందంతోనే మరింత ఉత్సాహంగా ముందుకు కదులుతుంటారు.