దైవలీల తెలుసుకోవడం సాధ్యమా ?
తిమ్మనాయకుడు తన తండ్రి మాదిరిగానే యుద్ధ విద్యల్లో ఆరితేరిన యువకుడు. అతని ధైర్యసాహసాలు చూసి అంతా ఆశ్చర్యపోతూ ఉండేవారు. దాంతో ఆయన ఆ రాజ్య రక్షణ విషయంలోను కీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటాడు. ఒక వైపున తల్లి అనురాగం ... మరోవైపున ప్రియురాలి ప్రేమ ... ఇంకో వైపున విడిచి ఉండలేని స్నేహితులతో ఆయన జీవితం సంతోషంగా సాగిపోతూ ఉంటుంది.
ధర్మం కోసం ప్రాణాలకి కూడా తెగించే స్వభావం కలవాడు కావడంతో, ఆయన పట్ల అందరికి మంచి అభిప్రాయం ఉండేది. అలాంటి తిమ్మనాయకుడు ఒకసారి యుద్ధంలో తీవ్రంగా గాయపడతాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయనని ఆదికేశవస్వామి కాపాడతాడు. భగవంతుడి సాక్షాత్కారాన్ని ... ఆయన అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా పొందిన తిమ్మనాయకుడికి, లౌకికమైన సుఖాల పట్ల విరక్తి కలుగుతుంది.
భగవంతుడి సన్నిధిలో నిలిచిన కాసేపు ఆయన తనని తాను మరిచిపోతాడు. అలాంటి సంతోషాన్ని శాశ్వతంగా పొందాలని అతని మనసు పరితపిస్తూ ఉంటుంది. భగవంతుడిని సమీపించాలంటే అందుకు మార్గాన్ని చూపే గురువును ఆశ్రయించాలని అనుకుంటాడు. తన తల్లి ... ప్రియురాలు ... స్నేహితులు వీళ్ళెవరూ ఇక అతని కనులముందు లేరు.
భగవంతుడి పట్ల వియోగాన్ని భరించలేని పరిస్థితుల్లో ఆయన ఉంటాడు. సాధ్యమైనంత త్వరగా గురువును ఆశ్రయించాలి ... భగవంతుడిని సేవించాలి ... అలౌకికమైన ఆనందాన్ని ప్రసాదించే పరమపదాన్ని పొందాలి. ఈ ఆలోచనతోనే ఆయన అందరినీ ... అన్నిటిని వదిలి వ్యాసరాయలవారి ఆశ్రమంలోకి అడుగుపెడతాడు. కనకదాసుగా తన జీవితాన్ని చరితార్థం చేసుకుంటాడు.