సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఏ దానం చేయాలి ?
లోకకల్యాణం కోసమే సుబ్రహ్మణ్యస్వామి ఆవిర్భవించాడు. దేవతల సేనాధిపతిగా వ్యవహరిస్తూ అసుర సంహారం చేశాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో తండ్రికి తగిన తనయుడిగా భక్తుల హృదయ సింహాసనాన్ని అధిష్ఠించి కనిపిస్తాడు. స్వామివారి వాహనం 'నెమలి' కావడం వలన, ఆయనని ఆరాధించేవారిని సర్పదోషాలు దరిచేరవు.
కొన్నిరకాల గ్రహదోషాలు జీవితంలో సుఖశాంతులు లేకుండా చేస్తుంటాయి. అలాంటివారు సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన ఆశించిన ఫలితం దక్కుతుంది. స్వామిని సేవించాలనుకునేవారికి 'సుబ్రహ్మణ్య షష్ఠి' ఒక పర్వదినమే కాదు ... అపూర్వమైన వరంగా కూడా చెప్పవచ్చు. ఈ రోజున ఆయనని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించవలసి ఉంటుంది. ఈ రోజున చేసే దాన ఫలితం జన్మజన్మలపాటు వెంటవస్తుంది.
పుణ్యరాశిని పెంచుకోవడానికి అనేక రకాల దానాలు చెప్పబడ్డాయి. భూదానం .. గోదానం .. సువర్ణ దానం .. అన్నదానం .. వస్త్ర దానం .. ఇలా ఎన్నో ఈ జాబితాలో కనిపిస్తాయి. ఒక్కో మాసంలో ... ఒక్కో సందర్భంలో చేసే దానం అనేక రెట్ల ఫలితాలను ఇస్తుందని స్పష్టం చేయబడుతోంది. సుబ్రహ్మణ్య షష్ఠి విషయానికే వస్తే, ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి స్వామివారిని పూజించిన తరువాత, సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంగా భావించి ఒక బ్రాహ్మణ బ్రహ్మచారికి భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలతో 'వస్త్ర దానం' చేయవలసి ఉంటుంది.
ఇక ఏ నోము ... వ్రతం చేసినా ఆ రోజున చేయవలసిన దానాలను పరిశీలిస్తే, అవి ఆ కాలానికి సంబంధించినవిగా ఉంటాయనే విషయం స్పష్టమవుతుంది. అలా మార్గశిర మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది కనుక, సుబ్రహ్మణ్య షష్ఠి రోజున తమ శక్తి కొద్దీ పేదలకు బట్టలను ... దుప్పట్లను దానం చేయాలనేది ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది. ఈ విధంగా ఈ రోజున వస్త్రదానం చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని చెప్పబడుతోంది.