కైలాసం నుంచి కదిలివచ్చిన శివుడు
కైలాసంలో మంచుకొండల మధ్య మహాశివుడు ధ్యాన నిమగ్నుడై ఉంటాడు. తన భక్తులు ఆర్తితో పిలిచినప్పుడు ... లోక కల్యాణానికి తన సహకారం అవసరమైనప్పుడు ఆయన తక్షణమే స్పందిస్తూ ఉంటాడు. అలాంటి మహాశివుడి విషయంలో ఇంద్రాది దేవతలు సైతం చాలా జాగ్రత్తగా మసలుకుంటూ ఉంటారు.
ఎందుకంటే ఆయన అనుగ్రహం ఎంతటి హాయిగా ఉంటుందో ఆగ్రహం అంతటి భయంకరంగా ఉంటుంది. అలాంటి మహాశివుడిపైనే కోపించినవాడిగా 'తిన్నడు' (కన్నప్ప) కనిపిస్తాడు. అందరికీ ఆహారాన్ని సమకూర్చేది ఆ మహాశివుడేననేది తిన్నడి భార్య అభిప్రాయం. తాను కష్టపడి అడవి మృగాలను వేటాడి తెస్తుంటే అందులో దేవుడి ప్రమేయం ఏవుందని వాదిస్తుంటాడు తిన్నడు.
అలా వాదించి వేటకి వెళ్లిన తిన్నడు ఒక్క జంతువును కూడా కొట్టలేకపోతాడు. ఉత్తచేతులతో ఇంటికి వెళ్లలేక అడవిలోనే ఉండిపోతాడు. అతని కోసం భార్య కూడా ఆకలితో ఎదురుచూస్తూ ఉంటుంది. ఆమె అమ్మవారి భక్తురాలు కాబట్టి ఆమె ఆకలితో ఉండటాన్ని అమ్మవారు తట్టుకోలేకపోతుంది. తనని తిన్నడు నమ్మకపోయినా స్వతహాగా అతను మంచి మనసున్నవాడు కాబట్టి, అతని విషయంలో ఆగ్రహించకుండా అనుగ్రహించడానికి సదాశివుడు సిద్ధపడతాడు.
ఆకలితో వున్న తిన్నడి దగ్గరికి బ్రాహ్మణుడి రూపంలో వెళ్లి ఫలాలను అందజేస్తాడు. ఆకలి ఆవేశాన్ని మరింత పెంచుతుందనీ, ముందుగా ఆత్మారాముడిని శాంతింపజేయమని చెబుతాడు. ఆ ఫలాలను స్వీకరించడానికి తిన్నడు తిరస్కరించడంతో, ఒక సాధారణమైన వ్యక్తిగా నిట్టూర్చుతూ అక్కడి నుంచి నేరుగా అతని ఇంటికి చేరుకుంటాడు.
తిన్నడు ఎక్కడ ఉన్నదీ ఆయన భార్యకి తెలియజేసి, అతనికి నచ్చజెప్పవలసిన బాధ్యతను ఆమెకి అప్పగిస్తాడు. ఇద్దరూ కలిసి ఆ ఫలాలను ఆరగించమంటూ వాటిని ఆమెకి అందజేసి వెనుదిరుగుతాడు. భగవంతుడు తన బిడ్డల విషయంలో ఎంతటి దయామయుడిగా వ్యవహరిస్తాడనడానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ సంఘటన కనిపిస్తూ ఉంటుంది. ఆకాశమంతటి ఆయన అనురాగాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఉంటుంది.