సుబ్రహ్మణ్యస్వామిని ఇలా స్తుతిస్తే చాలు

కుమారస్వామి జన్మించిన విధానాన్నిబట్టి ఆయనకి అనేక నామాలు ఏర్పడ్డాయి. ఈ కారణంగానే కుమారస్వామి జన్మించిన మార్గశిర శుద్ధ షష్ఠి ... కుమార షష్ఠిగా ... సుబ్రహ్మణ్య షష్ఠిగా ... స్కంద షష్ఠిగా ... కార్తికేయ షష్ఠిగా పిలవబడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రధాన దైవంగా అనుగ్రహించే స్వామి, మరికొన్ని ప్రాంతాల్లో పరివార దేవతగా కొలువుదీరి కనిపిస్తూ ఉంటాడు.

కొన్నిచోట్ల శక్తి ఆయుధాన్ని ధరించి బాలుడి రూపంలో దర్శనమిస్తాడు. మరికొన్ని చోట్ల సర్పరూపంలో పూజలందుకుంటూ ఉంటాడు. సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన సర్పదోషం తొలగిపోయి సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది. అందువలన ఈ స్వామి ఆలయాలు మహిళా భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి.

సుబ్రహ్మణ్యస్వామి జన్మించిన ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తారు. ఆలయానికి వెళ్లి స్వామివారికి పూజాభిషేకాలు జరిపిస్తారు. పుట్టలో పాలుపోసి ... బెల్లం ... అరటిపండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున సుబ్రహ్మణ్యస్వామిని తప్పకుండా స్తుతించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

''ఉమామహేశ్వర కుమారపుణ్యం .. పాహిపాహి సుబ్రహ్మణ్యం, భక్త జనప్రియ పంకజలోచన .. పాహిపాహి సుబ్రహ్మణ్యం, పతితపావన పార్వతినందన .. పాహిపాహి సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం మాం పాహి .. స్వామినాథ మాం పాహి .. శరవణ భవ శుభ మాం పాహి .. షణ్ముఖనాథ మాం పాహి, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం .. శివశివ శివశివ సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ... హరహర హరహర సుబ్రహ్మణ్యం, సత్య సనాతన సుందర శ్యామా .. నిత్యానందా ఘనేశ్వర శ్యామా .. లక్ష్మీ సేవిత పదయుగ శ్యామా .. సురముని వరగణ అర్చిత శ్యామా '' అంటూ ఈ రోజున సుబ్రహ్మణ్యస్వామిని స్తుతించడం వలన సమస్త దోషాలు ... దుఃఖాలు దూరమై సకల శుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.


More Bhakti News