మంగళవాద్యాలతో ఎదురైతే అంతా శుభమే !
సాధారణంగా ఏదైనా ముఖ్యమైన పనిపై ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు మంచి శకునం చూసుకుని బయలుదేరడమనేది ప్రాచీనకాలం నుంచి ఉంది. ఉద్యోగ అన్వేషణకు ... వివాహ ప్రయత్నాలకు ... దైవకార్యాలకు సంబంధించి ... ఇలా ఏ ముఖ్యమైన పనిమీద బయలుదేరవలసి వచ్చినా, మంచి ముహూర్తంతో పాటు శకునం చూసుకునే వెళుతుంటారు.
ఎందుకంటే మంచి శకునం వలన తలపెట్టిన కార్యక్రమం సాఫీగా పూర్తవుతుందనీ, లేదంటే ఆదిలోనే ఆ పనికి ఆటంకాలు ఎదురుపడటం ... అర్ధాంతరంగా ఆగిపోవడం జరుగుతూ ఉంటుందని అంతా బలంగా నమ్ముతుంటారు. శకునం బాగోలేదని ప్రయాణాలు వాయిదా వేసుకునే వాళ్లు, ఇంట్లోకి వచ్చి కాళ్లు కడుక్కుని ఇష్టదేవతను ప్రార్ధించి తిరిగి బయలుదేరేవాళ్లు ఉంటారు.
అలా ఒక ముఖ్యమైన పనిమీద బయలుదేరిన వాళ్లు, వీధి గుమ్మంలోకి వస్తూనే ... ఎవరు ఎదురుపడతారోననే ఆందోళనకి లోనుకావడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో దూరం నుంచి 'మంగళ వాద్యాలు' వినిపించినా ... ఎదురుగా వస్తూ కనిపించినా, ఎలాంటి సందేహం లేకుండా ముందుకి సాగిపోవచ్చని శాస్త్రం చెబుతోంది.
మంగళవాద్యాలు అనడంలోనే అవి ఎంతటి శుభప్రదమైనవో చెప్పబడుతున్నాయి. శుభకార్యాలకు ... దైవకార్యాలకు ... వివిధ రకాల వేడుకలకు మంగళవాద్యాలను ఉపయోగిస్తూ ఉంటారు. అలా ఏదో ఒక వేడుకకి సంబంధించిన వాళ్లు మంగళ వాద్యాలతో ఎదురుపడితే అది శుభానికి సూచనగా భావించాలి. తాము శ్రీకారం చుట్టబోతోన్న పనికి భగవంతుడి ఆశిస్సులు లభించినట్టుగా అనుకోవాలి. తాము ఏదైతే పని మీద బయలుదేరుతున్నామో ఆ పని విజయవంతంగా పూర్తవుతుందని విశ్వసించాలని చెప్పబడుతోంది.