సుబ్రహ్మణ్యస్వామికి నైవేద్యాలు
సుబ్రహ్మణ్యస్వామి అంటే ఇష్టపడని వాళ్లంటూ ఉండరు. ఆయన ఎక్కడ కొలువుదీరి ఉంటే అక్కడ భక్తుల సందడి భారీగానే ఉంటుంది. కొన్ని దేవాలయాల్లో విగ్రహరూపంలో కనిపించే స్వామి, మరొకొన్ని ఆలయాల్లో సర్పరూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. సర్పరూపంలో గల సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన, సంతానం కలుగుతుందనీ ... సంతానం నిలుస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.
సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కారణంగా గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పబడుతోంది. అలాంటి సుబ్రహ్మణ్యస్వామి జన్మించిన మార్గశిర శుద్ధ షష్ఠి 'సుబ్రహ్మణ్య షష్ఠి' గా చెప్పబడుతోంది. ఈ రోజు ఆయనకీ అత్యంత ప్రీతికరమైనది. అలాంటి ఈ రోజున సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన, ఆయన అనుగ్రహంతో పాటు పార్వతీ పరమేశ్వరుల కరుణా కటాక్షాలు లభిస్తాయని చెప్పబడుతోంది.
ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి .. ఉపవాస దీక్షను చేపట్టి ... నువ్వుల నూనెతో దీపారాధ చేయాలి. పూజా మందిరంలో గల సుబ్రహ్మణ్యస్వామికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. పాయసం ... కందిపప్పుతో కూడిన వివిధ రకాల పదార్థాలను ఆయనకి నైవేద్యంగా సమర్పించాలి. యాపిల్ పండ్లు ... దానిమ్మపండ్లు ... అరటిపండ్లను కూడా స్వామివారికి నివేదన చేయాలి.
స్వామివారు సర్పరూపంలో కొలువైన ఆలయాలకి వెళ్లి పుట్ట దగ్గర దీపారాధన చేసి, పుట్టలో ఆవుపాలను పోసి నమస్కరించాలి. ఈ విధంగా ఈ రోజున సుబ్రహ్మణ్యస్వామిని సేవించడం వలన, అనేక దోషాల నుంచి విముక్తి లభిస్తుందనీ ... సుఖశాంతులు ప్రాప్తిస్తాయని స్పష్టం చేయబడుతోంది.