దైవాజ్ఞ లేకుండా ఏం జరుగుతుంది ?
అంతా దేవుడి దయ ... ఆయన ఆదేశం లేకుండా ఏదీ జరగదు అనే మాట తరచూ వింటూ ఉంటాం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కొంతమంది భక్తులు చలించకుండా ఇదే విషయాన్ని సెలవిచ్చారు. అలాంటి వాళ్లలో ప్రహ్లాదుడు ఒకడిగా కనిపిస్తాడు. తన రాజ్యంలో తన పేరు మాత్రమే వినిపించాలనీ, హరినామాన్ని స్మరించవద్దని ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు ఎంతగా చెప్పినా వినిపించుకోడు.
దాంతో ప్రహ్లాదుడిని ఏనుగులతో తొక్కించడానికీ ... కాలకూట విషం ద్వారా అంతం చేయడానికీ ప్రయత్నిస్తాడు. మంటల్లో తోయిస్తాడు ... నడి సముద్రంలో పడదోయిస్తాడు. అయితే ప్రహ్లాదుడిని సమీపించడానికి ఏనుగులు సాహసించవు. ఇక కాలకూట విషం కూడా ఆయనపై ఎలాంటి ప్రభావం చూపలేకపోతుంది.
మంటల్లో తోయించినా ... సముద్రంలో పడవేసినా ప్రహ్లాదుడు చిరునవ్వుతో తిరిగి తన నివాసానికి చేరుకుంటాడు. ప్రహ్లాదుడు ప్రాణాలతో తిరిగొచ్చాడనే హిరణ్యకశిపుడి ఆనందాన్ని, శ్రీహరిపై అతనికి గల ప్రతీకారం అధిగమిస్తూ ఉంటుంది. ఎలా ప్రాణాలతో బయటపడి వస్తున్నావని ఆయన ప్రహ్లాదుడిని అడుగుతాడు.
పంచభూతాలు పరమాత్ముడి అధీనంలో ఉంటాయనీ, అన్ని జీవరాసులు ఆయన సృష్టిలోనివేనని అంటాడు ప్రహ్లాదుడు. అందువలన ఆ శ్రీహరికి వ్యతిరేకంగా ఏవీ వ్యవహరించవని చెబుతాడు. భగవంతుడి సేవకులు ఎల్లప్పుడూ ఆయన ప్రీతిని పొందుతూ ఉంటారనీ, వాళ్లందరినీ ఆయన సదా రక్షిస్తూ ఉంటాడని అంటాడు. సేవ చేయడం ... శరణు కోరడం మినహా ఆ స్వామిని ఎదిరించి నిలిచినవారులేరని చెబుతాడు. అయినా అహంకారంతో శ్రీహరి సహనాన్ని పరీక్షించిన హిరణ్యకశిపుడు ఆయన చేతిలో సంహరించబడతాడు.