ఈ క్షేత్రంలో అడుగుపెడితే చాలు !

సాధారణంగా రామాలయాలు ... శివాలయాలు మరింత ప్రాచీనతను కలిగినవిగా కనిపిస్తూ ఉంటాయి. ప్రాచీనకాలంలో రామాలయంగానీ ... శివాలయంగాని గ్రామాల్లో తప్పనిసరిగా ఉండేవి. ఇక ఈ రెండు ఆలయాలు గల గ్రామాల సంఖ్య కూడా ఎక్కువే. అలాంటి ప్రాచీన రామాలయాలో ఒకటి 'గండ్రాయి'లో విలసిల్లుతోంది.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో ఈ క్షేత్రం దర్శనమిస్తోంది. వనవాస కాలంలో సీతారామలక్ష్మణులు ఈ ప్రదేశం మీదుగా ప్రయాణం చేసినట్టు చెబుతారు. ఇది వారు విశ్రాంతి తీసుకున్న ప్రదేశమని అంటారు. వాళ్ల పాదస్పర్శచే పునీతమైన ప్రదేశం కనుకనే, కాలక్రమంలో ఇక్కడ ఆలయం నిర్మించడం జరిగిందని చెబుతారు.

వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు దర్శనమిస్తూ ఉంటారు. ఇక రాముడిని వదిలిపెట్టి హనుమంతుడు క్షణమైనా ఉండలేడు కాబట్టి, ఇక్కడికి దగ్గరలోనే ఆయనకి ప్రత్యేకమైన ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని హనుమంతుడు ఒక చెట్టుకింద లభించాడని చెబుతుంటారు. అటు రామాలయంలోను .. ఇటు హనుమంతుడి ఆలయంలోను పూజాభిషేకాలు జరుగుతుంటాయి.

కష్టాలను అర్థంచేసుకునే సీతమ్మవారు ... ఆ కష్టాలను గట్టెక్కించే రాముడు ... ఆయనకి సహకరించే లక్ష్మణుడు ... పిలిస్తే పలికే హనుమంతుడు కొలువుదీరినందున తమ జీవితం సుఖశాంతులతో సాగిపోతుందని స్థానికులు చెబుతుంటారు. ఈ క్షేత్రంలో అడుగుపెడితేచాలు దోషాలు తొలగిపోతాయనీ ... పాపాలు నశించిపోతాయని అంటారు. సీతారాముల అనుగ్రహం కారణంగా నెరవేరని కోరికంటూ ఉండదని ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News