శ్రీకృష్ణుడు ఇష్టపడి కొలువైన చోటు !

శ్రీకృష్ణుడి లీలావిశేషాలను గురించి ఎంతసేపు చెప్పుకున్నా తనివితీరదు. లోక కల్యాణం కోసమే కాదు ... భక్తులను అనుగ్రహించే విషయంలో కూడా ఆయన చూపిన మహిమలు అన్నీఇన్నీ కావు. కృష్ణుడు కొలువుదీరిన ఆయా క్షేత్రాలకు వెళితే అక్కడ ఆయన చూపిన మహిమలు ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాయి. పదే పదే పరవశానికి గురిచేస్తూ ఉంటాయి.

అలాంటి ఆయన లీలావిశేషాలు 'వల్లభి' క్షేత్రంలో కూడా వినిపిస్తూ ఉంటాయి. ఈ గ్రామం .. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ రుక్మిణీ సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు దర్శనమిస్తూ ఉంటాడు. ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకప్పుడు ఒక భక్తుడి పూజా మందిరంలోనివని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది.

చాలాకాలం క్రితం ఈ గ్రామంలో ఒక కృష్ణ భక్తుడు ఉండేవాడట. రుక్మిణీ సత్యభామ సమేతుడైన కృష్ణుడి విగ్రహాలు ఆయనకి ఎలా లభించాయనేది తెలియదు. ఆయన మాత్రం అనునిత్యం వాటిని పూజిస్తూ ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉండేవాడు. వయసు పైబడుతున్నా ఆయన భక్తి శ్రద్ధలు ఎంతమాత్రం తగ్గలేదు. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజున ఆయన స్వప్నంలో కృష్ణుడు కనిపించాడట.

పవిత్రమైన ... ప్రశాంతమైన ఈ ప్రదేశం తమకి ఎంతగానో నచ్చడం వల్లనే తాము ఇక్కడ కొలువై ఉన్నామని కృష్ణుడు తన భక్తుడితో చెబుతాడు. అంతకాలంగా తమని సేవిస్తూ వచ్చిన కారణంగా ఆయన వంశం తరిస్తుందని అంటాడు. ఇక తమ ప్రతిమలకు ఆలయాన్ని నిర్మించి అందరిచే పూజలు అందుకునేలా చేయమని సెలవిస్తాడు. అంతస్తోమత ఆ భక్తుడికి లేకపోయినా, భగవంతుడి అనుగ్రహం కారణంగా ఆ విగ్రహాలకు ఆలయం నిర్మించబడింది.

శ్రీకృష్ణుడు ఆవిర్భవించిన కారణంగానే ఈ గ్రామానికి 'వల్లభి' అనే పేరు వచ్చింది. అమ్మవార్లతో కలిసి స్వామివారు ఇష్టపడి ఇక్కడ ఆవిర్భవించిన కారణంగా, ఆయన ఈ క్షేత్రంలో ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇక్కడి స్వామివారిని దర్శించడం వలన కష్టాలు కనిపించకుండా పోతాయనీ, సంతోషాలు సమకూరతాయని చెబుతుంటారు.


More Bhakti News