సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఉపవాస ఫలితం !
సుబ్రహ్మణ్యస్వామి పేరు వినగానే మనోహరమైన ఆయన రూపం కనులముందు కదలాడుతుంది. కిరీటం ... రుద్రాక్షలు ... విభూతి రేఖలు ... వేలాయుధం ధరించి, పక్కనే నిలుచున్న నెమలి వాహనంతో ఆయన దర్శనమిస్తూ ఉంటాడు. మరికొన్ని క్షేత్రాల్లో ఆయన సర్పరూపంలో కొలువై కనిపిస్తూ ఉంటాడు. అలాగే వల్లీ - దేవసేన సమేతుడుగా కూడా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు.
తారకాసుర సంహారం కోసం పార్వతీపరమేశ్వరుల పుత్రుడుగా మార్గశిర శుద్ధ షష్ఠి రోజున సుబ్రహ్మణ్యస్వామి జన్మించాడు. లోక కల్యాణం కోసం ఆ స్వామి జన్మించిన శుభసందర్భంగా ఆయనకి ప్రత్యేక పూజాభిషేకాలు జరుపుకునే ఈ రోజుని 'సుబ్రహ్మణ్య షష్ఠి' గా భావిస్తుంటారు. ఈ రోజున స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో షోడశ ఉపచారాలతో ఆరాధించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
ఇక స్వామిని సర్పరూపంలో పూజించేవారు ఈ రోజున పుట్టలో పాలుపోసి ఆయన పట్ల తమకి గల భక్తిశ్రద్ధలను చాటుకుంటూ ఉంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఉపవాసం ఉండటం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి స్వామివారిని పూజించడం వలన, ఆయనకి ఇష్టమైన నైవేద్యలను సమర్పించడం వలన సర్ప సంబంధమైన దోషాలు తొలగిపోయి, సకల శుభాలు చేకూరతాయి.