కామాక్షీదేవి కలిగించే వివాహయోగం !
తల్లిదండ్రులు తమ కూతురిని తమలా చూసుకునే వ్యక్తికిచ్చి వివాహాన్ని జపించాలని అనుకుంటారు. అలాంటి సంబంధం కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. ప్రేమానురాగాల విషయంలో తమకి తగిన సంబంధం అనిపిస్తే కబురుచేయమని బంధుమిత్రులకు కూడా చెబుతారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్ల వివాహం ఆలస్యమవుతున్నా కొద్దీ ఆ తల్లిదండ్రుల ఆందోళన మరింత ఎక్కువవుతూ ఉంటుంది. వివాహం విషయంలో అమ్మాయికి ఏదైనా దోషం వుందో ... లేదంటే తమ ప్రయత్నలోపమో అర్థంకాక అయోమయానికి లోనవుతారు. తల్లిదండ్రులు పడుతోన్న బాధను చూసి ఆడపిల్లలు కూడా మానసికపరమైన వత్తిడికి లోనవుతుంటారు.
ఇలా వివాహం విషయంలో ఇబ్బందులు పడుతున్నవాళ్లు 'మాంగాడు' క్షేత్రాన్ని దర్శించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని అనుభవపూర్వకంగా చాలామంది చెబుతుంటారు. మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం తమిళనాడు - చెన్నై సమీపంలో విలసిల్లుతోంది. కామాక్షీదేవి (పార్వతీదేవి) కాంచీపురంలోని 'ఏకామ్రేశ్వరస్వామి'ని వివాహమాడటం కోసం ఇక్కడే తపస్సు చేసిందని స్థలపురాణం చెబుతోంది.
వివాహం విషయంలో అమ్మవారి కోరిక నెరవేరిన ప్రదేశం కావడం వలన, వివాహం విషయంలో ఆడపిల్లల మనసును అర్థంచేసుకునే అమ్మవారు ఆవిర్భవించిన కారణంగా ఇది మహిమాన్వితమైనదిగా చెబుతారు. ఈ కారణంగానే వివాహ సంబంధమైన సమస్యలు ఎదుర్కుంటోన్న వాళ్లు, ఇక్కడ కొలువైన కామాక్షీ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు.
అమ్మవారిని దర్శించుకుని తమ ఆవేదనను చెప్పుకున్న యువతులకి అనతికాలంలోనే వివాహయోగం కలుగుతుందని అంటారు. అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుందనడానికి నిదర్శనం, ఆ తల్లి ఆశీస్సుల కారణంగా వివాహమైనవారు తమ మొక్కులను చెల్లించుకోవడానికి పెద్దసంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉండటమే.