ఆపదలు దరిచేరకుండా చూసే సాయిబాబా
శిరిడీ సాయిబాబాతో భక్తులకు గల అనుబంధం పెరుగుతూపోతుందే తప్ప తగ్గదు. ఎందుకంటే తనని ప్రేమించేవారిని వదిలిపెట్టి ఆయన వెళ్లడు ... తనని విశ్వసించే వారిని ఎలాంటి ఇబ్బందుల్లోను పడనీయడు. తన భక్తులైనవారి కుటుంబాల బాధ్యతను బాబా పరోక్షంగా నిర్వహిస్తూనే ఉంటాడు.
అందుకే బాబా భక్తులు ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు, ఆ పని అయితే దానిని బాబా ఆమోదించాడని అనుకుంటారు. ఒకవేళ ఆ పని కాకపోతే తమ మంచి కోసమే బాబా అలా చేశాడని భావిస్తారు. ఇంతటి విశ్వాసాన్ని పొందిన కారణంగానే అనేక ప్రాంతాల్లో బాబా ఆలయాలు అలరారుతున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి 'అల్లీపురం'లో దర్శనమిస్తుంది.
ఖమ్మం జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఈ గ్రామం కనిపిస్తుంది. అందంగా తీర్చిదిద్దబడిన ఇక్కడి ఆలయాన్ని చూస్తే బాబా పట్ల ఇక్కడివారికి గల భక్తిశ్రద్ధలు అపారమని అర్థమవుతాయి. ఇక్కడి బాబా భక్తులకు అండదండగా నిలుస్తాడనీ, ఆపదలోపడకుండా అనుక్షణం రక్షిస్తూ ఉంటాడని విశ్వసిస్తుంటారు. అందుకు ఉదాహరణగా తమ అనుభవాలను ఆవిష్కరిస్తూ ఉంటారు.
ప్రతి గురువారం ఈ ఆలయంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఊరంతా ఉత్సాహంగా కదిలివచ్చినట్టు అనిపిస్తుంది. బాబా అభిషేకాల్లోను ... హారతుల్లోను ... ప్రత్యేక సేవల్లోను భక్తులు అంకితభావంతో పాల్గొంటూ ఉంటారు. వేదికపై సింహాసనాన్ని అధిష్ఠించిన బాబా, భక్తులు చూపుతోన్న ప్రేమాభిమానాలకు మురిసిపోతూ మరింత సంబరంగా ... సంతోషంగా దర్శనమిస్తూ ఉంటాడు.