భక్తులను కనిపెట్టుకునుండే బాబా !
శిరిడీ సాయిబాబా భక్తుల ఇళ్లలో ఆయన చిత్రపటాలు గానీ ... ప్రతిమలు గాని తప్పనిసరిగా ఉంటాయి. వాళ్లు బాబాను ఎంతో అపురూపంగా ... ప్రేమతో చూసుకుంటూ ఉంటారు. ఆయనకి నిత్యపూజలు ... నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ఇక వాళ్లు ఏదైనా ఊరికి వెళ్లవలసి వస్తే, ఆయనకి ఇష్టమైన పాలకోవాలుగానీ, ఫలాలుగాని పూజామందిరంలో పెట్టి వెళుతూ ఉంటారు.
ఎందుకంటే బాబా చిత్రపటానికీ ... బాబా ప్రతిమకి ... బాబాకి ఎలాంటి తేడా లేదనే విషయాన్ని స్పష్టం చేసేవిగా భక్తుల అనుభవాలు వినిపిస్తుంటాయి. బాబా శిరిడీలోని మశీదులో ఉంటోన్న రోజుల్లోనే ఆయనకి ఎంతోమంది భక్తులు ఉండేవాళ్లు. ఒక గ్రామంలో గల బాబా భక్తుడు అనునిత్యం ఆయన చిత్రపటానికి నమస్కరించి, పాలకోవాలను నైవేద్యంగా పెట్టి, తన పనికి వెళుతూ ఉండేవాడు.
ఒకసారి ఆయన బాబాను చూడటానికి శిరిడీకి వెళ్లాలనుకుంటాడు. ఎలాగో బాబా దగ్గరికే వెళుతున్నాను కదా అనే ఉద్దేశంతో, చిత్రపటం దగ్గర పాలకోవాలు పెట్టకుండా వాటిని సంచీలో వేసుకుని బయలుదేరుతాడు. రెండు మూడు రోజుల తరువాత ఆయన శిరిడీ చేరుకుంటాడు. ఆయనని చూడగానే బాబా నవ్వుతూ తన కోసం తెచ్చిన పాలకోవాలను ఇవ్వమని అడుగుతాడు.
రెండు మూడు రోజులుగా తాను ఆయన ఇంటికి వస్తూనే ఉన్నాననీ, అతను రోజూ ఉంచే చోట తనకి ఎలాంటి నైవేద్యం లభించలేదని చెబుతాడు. అతను తన దగ్గరికే వస్తోన్న సంగతి తనకి తెలుసనీ, కాకపోతే రుచికరమైన పాలకోవాలు దక్కడానికి ఆలస్యమైందంటూ వాటిని ఆరగిస్తాడు. బాబాకి ... ఆయన చిత్రపటాలకి .. ప్రతిమలకి ఎలాంటి తేడా లేదనే విషయం ఆ భక్తుడితో పాటు అక్కడున్న వాళ్లందరికీ స్పష్టమవుతుంది.