ఆదర్శాన్ని ఆవిష్కరించే అసమాన భక్తి
పరమశివుడిని స్తుతిస్తూ ... ఆయన తత్త్వాన్ని ప్రచారం చేస్తూ నాయనార్లు తమ జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు. అలాంటి నాయనారులలో తిరుజ్ఞాన సంబందర్ ... తిరునావక్కసర్ నాయనార్ ముందువరుసలో కనిపిస్తారు. తిరునావక్కసర్ ని 'అప్పార్' అంటూ సంబందర్ ప్రేమగా పిలిచేవాడు. అసమానమైన భక్తితో ఆదిదేవుడిని మెప్పించడంలో ఇద్దరూ ఇద్దరే.
ఒకరంటే ఒకరికి అపారమైన అభిమానం. సాక్షాత్తు సదాశివుడితో నేరుగా మాట్లాడేంత చనువు ఈ ఇద్దరికీ ఉండేదట. తమకి కలిగిన కొన్ని సందేహాలను వాళ్లు సదాశివుడి దగ్గర ప్రస్తావించగా, ఆయన స్వయంగా సందేహ నివృత్తి చేశాడని అంటారు. ఇద్దరూ కలిసి అనేక శైవక్షేత్రాలను దర్శిస్తూ ... అక్కడ భక్తిభావ పరిమళాలు వెదజల్లుతూ ఆధ్యాత్మిక మార్గంలో అపూర్వమైన ప్రయాణాన్ని కొనసాగించారు.
ఈ నేపథ్యంలో వాళ్లకి ఎదురైన పరిస్థితులు ... వాటిని వాళ్లు అధిగమించిన తీరు వాళ్ల శివభక్తికి దర్పణం పడతాయి. ఈ నేపథ్యంలోనే ఒకసారి అప్పార్ ని చూడటానికి సంబందర్ పల్లకిలో వస్తాడు. ఇద్దరూ కలిసి శివతత్త్వం గురించి కాసేపు ముచ్చటించుకున్నాక సంబందర్ బయలుదేరుతాడు. పల్లకి ఎక్కినా ఆయనకి అప్పార్ కనిపించకపోవడంతో, ఇంతలో ఎక్కడికి వెళ్లాడా అని చుట్టూరా చూస్తాడు. అయినా ఆయన కనిపించకపోవడంతో పెద్దగా పిలుస్తాడు. తాను ఆయన వెనకే ఉన్నాననీ ... పల్లకీని మోస్తున్నానని చెబుతాడు అప్పార్.
శివ శివా అంటూ పల్లకిలో నుంచి దిగిన సంబందర్, ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ అప్పార్ పాదాలకు నమస్కరిస్తాడు. వాళ్ల మధ్య గల ప్రేమాభిమానాలకు ఇది ఒక మచ్చుతునక మాత్రమే. ఆదిదేవుడిని ఆరాధించడంలోనే కాదు ... ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడంలోను ఒకరిని మించినవాళ్లు ఒకరని ఇప్పటికీ వాళ్లను గురించి చెప్పుకుంటూ ఉంటారు.